ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరి పాకాన పడిన సంగతి తెలిసిందే. మొన్న మొన్నటివరకు పాలు, నీళ్లలా కలిసిమెలిసి ఉన్న జగన్, కేసీఆర్ లు…కృష్ణానదీ జలాల పంపకాల విషయంలో ఉప్పు, నిప్పు మాదిరిగా మారి విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇక, ఏపీ, తెలంగాణల మధ్య నీళ్ల పంచాయతీ కేంద్రం దగ్గరకు చేరింది. దీంతో, ఈ వివాదానికి పరిష్కారం చేస్తామని చెబుతోన్న కేంద్రం…రాష్ట్రాల సొమ్మును డిపాజిట్ గా ఉంచి వాటిపైనే పెత్తనం చేయాలని చూస్తోంది.
ఇక, ఇలా లాభం లేదనుకున్న ఏపీ సర్కార్ ఓ అడుగు ముందుకు వేసి…తమ నీటి హక్కును తెలంగాణ కాల రాస్తోందంటూ సుప్రీం కోర్టులో ఏకంగా పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంగా సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలు ఈ సమస్యను చర్చల ద్వారా, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని జస్టిస్ ఎన్వీ రమణ కీలక సూచన చేశారు.
కృష్ణాబోర్డును నోటిఫై చేసినందున ఈ పిటిషన్ పై విచారణ అవసరం లేదని తెలంగాణ తరఫు న్యాయవాది వాదించారు. కానీ, ఆ గెజిట్ సెప్టెంబర్ తర్వాత అమల్లోకి వస్తుందని, ఇప్పటి నుంచే అమలు చేస్తే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ఇరుపక్షాల వాదనలను దాదాపు గంటపాటు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. తాను తెలుగువాడినని, ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.