ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. కేంద్రం నిధులను రాష్ట్రం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన బీజేపీ గోదావరి గర్జన’ సభకు హాజరైన ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని.., రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉంటుందన్న ఆయన.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. జగన్ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని.. విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆక్షేపించారు. కేంద్ర నిధులు, పథకాలు దారి మళ్లించారని ఆరోపించారు. జగన్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు వెనక్కి వెళ్లాయన్నారు. జగన్ పాలనలో శాంతిభద్రతలు కరువయ్యాయని..,ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ హయాంలో అవినీతి తారస్థాయికి చేరి.., ఇసుక, భూమి, మద్యం మాఫియా అడ్డూ అదుపులేకుండా చేలరేగిపోతుంద న్నారు. రాష్ట్రంలో వైసీపీ పోవాలి.. బీజేపీ రావాలి అనే నినాదానిచ్చారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు. పెట్టుబడులు రాక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంది. రాష్ట్రంలో రూ.8.7 లక్షల కోట్ల పెట్టుబడులు కేంద్రం పెడుతోంది. 2014కు ముందు దేశంలో తీవ్రమైన విద్యుత్ కోతలు ఉండేవి. గతంలో ఆరోగ్య రక్షణ, ఆరోగ్య బీమాకు ఎలాంటి హామీ లేదు. అని నడ్డా విరుచుకుపడ్డారు.
గతంలో అవినీతి, కుంభకోణాలు మాత్రమే వార్తలు నిలిచేవి. గతంలో బంధుప్రీతి, వారసత్వానికి పరాకాష్టగా పాలన సాగేది. మోడీ అధికారంలోకి వచ్చాక సంస్కరణలు తెచ్చారు. మోడీ రాజకీయ దృక్కోణాన్ని పూర్తిగా మార్చారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకెళ్తున్నాం. దేశంలో అవినీతిని పారద్రోలేందుకు చర్యలు తీసుకున్నారు అని జేపీ నడ్డా అన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి అద్వానంగా ఉందని నడ్డా ఆక్షేపించారు. పెట్టుబడులు లేక రాష్ట్రంలో నిరుద్యోగం తాండవిస్తోంద న్నారు. రాష్ట్రంలోని ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ హయాంలో మాతృభాషకు పెద్దపీట వేశామని..,రాష్ట్రంలో తెలుగు భాషకు అన్యాయం జరుగుతోందని వ్యాఖ్యనించారు. పలు సంక్షేమ పథకాలకు నిధులు తగ్గుతున్నాయని.., కేంద్రం తరఫున రూ.77 వేల కోట్లు అందించామని చెప్పారు. పీఎం ఆవాస్ యోజన కింద ఏపీకి 27 లక్షల ఇళ్లు, ఏపీ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, గిరిజన వర్సిటీ మంజూరు చేశామని చెప్పారు.