జరుగుతున్నది గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థకు ఎన్నికలు. ఈ ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. ఏకంగా తన జాతీయ అధ్యక్షుడ్నే ప్రచారానికి తీసుకొచ్చింది. దీంతో.. గ్రేటర్ ఎన్నికలకు ఆ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసింది. శుక్రవారం సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షో నిర్వహించారు. అనంతరం మేధావుల భేటీలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఫాంహౌస్ నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్.. రోల్ మోడల్ ఎలా అవుతారన్న ఆయన.. ‘రోల్ మోడల్ గా ఉండే నాయకుడు ప్రజల ముందుకు వెళ్లాలి. ప్రధాని నరేంద్రమోడీ లద్ధాఖ్ వెళ్లి సైనికులను ఎలా ప్రోత్సహించారో చూడండి. కరోనా నియంత్రణకు ముందుండి దేశాన్ని నడిపారు’ అని పేర్కొన్నారు. వాస్తుభయంతో సచివాలయాన్ని కూల్చివేశారని.. అలాంటి వ్యక్తి ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తారని ఎద్దేవా చేశారు.
ఇప్పటివరకు విపక్షాలు లేవనెత్తని అంశాన్ని ఘాటుగా.. సూటిగా వ్యాఖ్యానించటం ద్వారా నడ్డా సంచలనంగా మారారు. వేల కోట్ల రూపాయిల కుంభకోణాలు చేసినా.. కేసీఆర్ కుటుంబానికి ఆకలి తీరలేదన్న ఆయన.. అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధుల్ని స్వాహా చేస్తున్నారన్నారు. అధికారం కోసం రజాకార్ల పార్టీతో పొత్తు పెట్టుకున్న టీఆర్ఎస్ కు గ్రేటర్ ప్రజలు గుణపాఠం చెప్పాలన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుతో దేశంలోని కుటుంబ పార్టీలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని.. కానీ.. అవన్నీ కుటుంబ పార్టీలుగా పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న చాలా పథకాలు కేంద్రానివే అని చెప్పిన నడ్డా.. స్వచ్ఛభారత్ లో ఒక్క తెలంగాణలోనే 29 లక్షల మరుగుదొడ్లనునిర్మించాం.. తెలంగాణకు ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతి బీబీనగర్ ఎయిమ్స్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ మొదలుకొని అన్ని పార్టీలు కుటుంబ పార్టీలేనని.. బీజేపీ అందుకు భిన్నమన్నారు. సాధారణ కార్యకర్తలకు పార్టీలో ఉన్నత పదవులు లభిస్తాయనటానికి బండి సంజయ్.. కిషన్ రెడ్డిలే నిదర్శనమన్నారు. కేసీఆర్ సర్కారును.. ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లుగా కనిపించిన నడ్డా.. అవినీతిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.