“ఫాథర్సు డే” సందర్భంగా, నేడు అందరు తండ్రులకు నివాళులిస్తూ సిలికానాంధ్ర ఘనంగా జరుపుకున్న “పితృదేవోభవ” కార్యక్రమము దిగ్విజయంగా జరిగింది. కొండిపర్తి దిలీపు తండ్రికున్న విశిష్ఠతను వివరిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్యక్రమంలో ముఖ్యభాగమైన శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రసంగము పద్యాలతో పారడీలతో, పౌరాణిక గాధలతో, తన గానధారలతో ఆధ్యంతము ప్రేక్షకులను ఆకట్టుకుంది. జొన్నవిత్తులవారిని ఆహ్వానిస్తూ కూచిభట్ల ఆనందు మాట్లాడుతూ జొన్నవిత్తులవారి సాహిత్యమే కాదు వారి సాంగత్యము కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అని వారితో తనకున్న అనుభవాలను పంచుకున్నారు.
జొన్నవిత్తుల ప్రసంగిస్తూ, రామాయణ, భారత పురాణేతిహాసాలను ఉటంకిస్తూ హైందవధర్మంలో తండ్రికున్న అగ్రస్థానము మరే సంప్రదాయములోనూ లేదని వక్కాణిస్తూ, రాముడు, భీష్ముడు, పరశురాముడు వంటి చారిత్రాత్మక పురుషుల గొప్పతనాన్ని వివరించారు. తండ్రిలేని పిల్లలకు కుంతియే తండ్రియై ఎలా పెంచిందో కూడా వివరించారు. ఆలాగే తన రామలింగేశశతకము, సింగరేణిశతకము, కోనసీమ శతకములోని పద్యాలను పాడివినిపించారు. వారి పారడీపాటలు ప్రేక్షకులను ప్రత్యేకముగా ఆకట్టుకున్నాయి.
కార్యక్రమంలో చివరగా తండ్రిని ప్రశంసిస్తూ రావు తల్లాప్రగడ స్వీయపద్యగానంచేసి, తరువాత జొన్నవిత్తులవారిని ప్రశంసిస్తూ మరిన్ని పద్యాలతో వారిని సన్మానించారు. అలా కార్యక్రమము సరదాగా రెండుగంటలకు పైగా నడచింది.