జగన్ స్పీచ్ అంతా... ‘కుల‘కలమే
ఏపీ సీఎం జగన్.. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ అవతరణ అంటూ.. ఓ పెద్ద కార్యక్రమాన్నే నిర్వహించారు. సరే! రాష్ట్రం ఇప్పుడే అవతరించిందా? అక్టోబరా.? నవంబరా.? జూనా? వంటి.. దీనిపై అనేక వివాదాలు ఉన్నప్పటికీ.. సీఎం జగన్ చేసిన ప్రయత్నంతో రాష్ట్రానికి ఓ అవతరణ రోజంటూ ఉందనే విషయం స్పష్టమైంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ చేసిన సుదీర్ఘ ప్రసంగం.. రాష్ట్ర అవతరణను అడ్డు పెట్టుకుని.. తన మనసును ఆవిష్కరించుకున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వీటిని వీక్షించిన వారు.. జగన్‌పై పలు కామెంట్లు చేయడం గమనార్హం.
ఇంతకీ.. జగన్ ఈ కార్యక్రమంలో ఏమన్నారు? అనే విషయాన్ని పరిశీలిస్తే.. అవతరణ వేడుక సందర్భం గా.. పరోక్షంగా ఆయన తన ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు. అదేసమయంలో కులాలు మతాలు.. అంటూ.. గత సర్కారుపై ఎత్తిపొడుపులు.. విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చారు. అదేసమయంలో మీడియాను కూడా జగన్ వదిలిపెట్టకపోవడం గమనార్హం. ``తమ వాడు.. తన వాడు. అధికారంలోకి రాలేదని.. పత్రికలు, ఛానెళ్లు.. ఇష్టానుసారం దుమ్మెత్తిపోస్తున్నాయి. దీనిని కూడా సహిద్దామా?`` అంటూ.. తన మనసులో ఉన్న అక్కసును మొత్తం జగన్ బయటకు కక్కేశారు.
అదేసమయంలో బయటివారి కత్తిపోట్లు.. సొంత వారి వెన్నుపోట్లు.. అంటూ.. గత చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించేశారు. అదేసమయంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని కూడా దుయ్యబట్టారు.
ఇలా.. మొత్తం ప్రసంగంలో ఏపీ అభివృద్ధి విషయాన్ని.. తాను పెట్టుకున్న విజన్‌ను స్పృశించే ప్రయత్నం పావలా ఉంటే.. గత సర్కారుపైనా.. పరోక్షంగా చంద్రబాబు.. మీడియాల పైనా.. జగన్ ఓ విన్యాసమే చేశారని.. ఈ సమయంలో ఇది అంత అవసరమా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఏదైనా.. రాజకీయంగా విమర్శలు చేయాలని అనుకుంటే. ఇది సరైన వేదిక కాదనే అభిప్రాయం 90 శాతం మందికిపైగా వెల్లడించడం గమనార్హం.
మరీ ముఖ్యంగా.. రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారన్న వ్యాఖ్యలపై మెజారిటీ.. నెటిజన్లు.. తీవ్రంగా ఫైరయ్యారు. ఎన్నడూ లేని విధంగా రాజ్యాంగం నేడు అపహాస్యం పాలవుతోందని.. ఏపీ హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు రాష్ట్రంపై దుమ్మెత్తి పోస్తుంటే.. కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. మరికొందరు.. అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమమని చెబుతూనే .. ఇలా వ్యవహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తంగా ఈ కార్యక్రమం ద్వారా జగన్.. రాష్ట్ర అవతరణ దినోత్సవం పేరుతో తన మానసిక అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేశారంటూ.. సటైర్లు పేలుస్తుండడం గమనార్హం.