వైసీపీ నాయకులు పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రచారం కంటే కూడా.. ఏసయ్య ప్రచారాన్ని అందుకు న్నట్టు తెలుస్తోంది. పైనుంచి వచ్చిన ఆదేశాలో లేక.. వారి మనసులో ఉన్న ఆలోచనలో మొత్తానికి కీలక నాయకులు.. ఏసయ్యను సెంట్రిక్‌గా చేసుకుని.. కామెంట్లు చేస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏసయ్యను నమ్మిన బిడ్డ అంటూ సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంగళవారం రాత్రి పాల్గొన్న మంత్రి జోగి.. వచ్చే ఎన్నికల్లో ఏసయ్యను నమ్మిన బిడ్డను మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు. “గత ఎన్నికల్లో విజయమ్మగారు బైబిల్‌ను పట్టుకుని ప్రచారం చేశారు. ఇది మనం చూశాం. బైబిల్ పట్టుకోవడమే కాదు.. ఏసయ్యను నమ్మారు కూడా. ఏసయ్యను నమ్మిన బిడ్డ రాష్ట్రంలో ఎంత మంచి పాలన అందిస్తున్నారో మనం చూస్తున్నాం“ అని జోగి వ్యాఖ్యానించారు.
ఏసయ్యను నమ్మి, శాంతి యుత, ప్రజాసంక్షేమ పాలనను అందిస్తున్న జగన్ మోహన్‌రెడ్డిని మనం మరోసా రి ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఉందని మంత్రి జోగి చెప్పుకొచ్చారు. “గత ఎన్నికల్లో బైబిల్ పట్టుకుని వస్తున్నారంటూ.. ప్రతిపక్ష పార్టీలు.. అవమానకరంగా వ్యాఖ్యానించాయి. విమర్శలు చేశాయి. అయినా.. జగనే విజయం దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా మీరంతా జగన్‌ను గెలిపించేందుకు, ఏసయ్యను నమ్మిన బిడ్డను సీఎం సీటులో కూర్చోబెట్టేందుకు ప్రయత్నించాలి“ అని జోగి వ్యాఖ్యానించారు.
కాగా, కొద్ది రోజుల కిందట కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కూడా.. ఇదే వ్యాఖ్యలు చేశారు. క్రైస్తవుడైన జగన్.. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని, ఆయన సుభిక్షమైన పాలన అందిస్తున్నారని అప్పట్లో ద్వారం పూడి వ్యాఖ్యానించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై అధిష్టానం ఒకింత సీరియస్ అయినట్టు అప్పట్లో వార్తలు రావడం గమనార్హం.