కాంగ్రెస్ పార్టీ తీరే భిన్నం. అప్పటివరకు రేసులో ఉన్న వారంతా పక్కకు వెళ్లటం.. కొత్త క్రిష్ణుడు తెర మీదకు రావటం ఆ పార్టీలో మామూలే. పార్టీ పదవులే కాదు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వేళలోనూ ఊహించని వారికి పదవులు అప్పుడప్పుడు వస్తుంటాయి. అంతదాకా ఎందుకు.. ఎన్నికల వేళలో చేతికి బీఫాం ఇచ్చిన తర్వాత కూడా అభ్యర్థుల్ని మార్చేసిన ఉదంతాల గురించి రాజకీయ వర్గాలు గుర్తు చేస్తుంటాయి. ఇదంతా ఎందుకంటే.. తాజాగా అలాంటి సీనే ఒకటి చోటు చేసుకుంది మరి.
గడిచిన కొద్దికాలంగా టీపీసీసీ చీఫ్ పదవి కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి. రేవంత్ వర్సెస్ కోమటి రెడ్డి అంటూ సాగిన ప్రచారానికి భిన్నంగా.. తాజాగా జీవన్ రెడ్డి పేరు తెర మీదకు రావటం ఆసక్తికరంగా మారింది. కోమటి రెడ్డికి టీపీసీసీ పదవి ఇచ్చేందుకు అధినాయకత్వం సిద్దంగా లేదని.. అదే సమయంలో రేవంత్ కు పగ్గాలు అప్పజెబితే.. పార్టీలో రెండు వర్గాలు తయారవుతుయన్న ఆలోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రత్యామ్నాయం దిశగా ప్రయత్నాలు షురూ చేసింది.
ఈ కారణంతోనే టీపీసీసీ చీఫ్ ఎవరన్న విషయాన్ని ప్రకటించకుండా పక్కన పెట్టింది. వివిధ సమీకరణాల నేపథ్యంలో సీనియర్ నేత.. పార్టీ అంటే కమిట్ మెంట్ తో పాటు.. అందరిని కలుపుకుపోయే సీనియార్టీ ఉన్న జీవన్ రెడ్డి అయితే బాగుండన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. తన మైండ్ సెట్ కు.. తన వర్కింగ్ స్టైల్ కు పార్టీ అధ్యక్ష పదవి కంటే కూడా ప్రచార కమిటీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని.. పాదయాత్రలు చేయటానికి వీలు ఉంటుందని వ్యాఖ్యానించారు.దీంతో.. జీవన్ రెడ్డికి టీపీసీసీ పగ్గాలు అప్పజెప్పి.. రేవంత్ కు ప్రచార బాధ్యతలు అప్పగిస్తే.. అందరికి ఆమోదయోగ్యంగా ఉంటుందన్న అభిప్రాయం నెలకొంది. తాజా పరిణామాల్నిచూస్తే.. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన జీవన్ రెడ్డి పేరే ఫైనల్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.