ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. “థూ.. నీ బతుకు చెడ“ అని నిప్పులు చెరిగారు. అదేసమయంలో ధర్మవరం ఎమ్మెల్యే, పెద్దారెడ్డి సోదరుడి కుమారుడు, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపైనా జేసీ విరుచుకుపడ్డారు. ఇద్దరినీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. ప్రజల సొమ్ము కొట్టేయడంలో బాబాయి.. అబ్బాయి.. ఇద్దరూ పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు.
సర్వం కోల్పోయిన రైతులకు న్యాయం చేయడంలో పెద్దారెడ్డి చేతులు ఎత్తేశారని జేసీ విమర్శలు గుప్పించారు. అయితే, అదేసమయంలో తనకు చెందిన ఏడాదిన్నర చీనా తోటకు మాత్రం పంట భీమా డబ్బులు ప్రజాధనాన్ని కొట్టేశారని ఆరోపించారు. పంటల భీమా వ్యవహారంలో రైతులకు న్యాయం జరగలేదని పేర్కొన్నారు. క్రాప్ ఇన్సూరెన్స్ రూపంలో 13.89 లక్షల రూపాయలు ఎమ్మెల్యే పెద్దారెడ్డి దోచుకున్నారని జేసీ లెక్కలతో సహా చెప్పుకొచ్చారు.
ఏడాది వయస్సున్న చీనా చెట్లకు పంట నష్టం భీమా ఎలా ఇచ్చారో.. దీనిలో మీరు ఎంత దిగమింగారో.. చెప్పాలని అధికారులను సైతం జేసీ నిలదీశారు. దీనిపై వచ్చే సోమవారం స్పందనలో ఫిర్యాదు చేస్తానని, చర్యలు తీసుకోకపోతే.. నిరసనకు కూడా వెనుకాడనని పేర్కొన్నారు. ఇక, పెద్దారెడ్డిపై తీవ్ర విమర్శ చేశారు.. ‘‘ఎమ్మెల్యే పెద్దారెడ్డి పాడె ఎత్తే… నేను పోతా…. థూ నీ బతుకు చెడ’’ అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
క్లబ్బుల్లో గ్లాసులు కడిగేవాడు!
ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపైనా జేసీ విమర్శలు గుప్పించారు. తనకు సంబంధం లేని తాడిపత్రికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని వెంకట్రామిరెడ్డిపై విరుచుకుపడ్డారు. ‘నీ ధర్మవరం వస్తా… ఇంటికే వస్తా…. ఏం చేస్తావ్’’ అంటూ సవాల్ విసిరారు. వెంక్రట్రామిరెడ్డి లండన్ క్లబ్బుల్లో గ్లాసులు కడిగేవాడని ఎద్దేవా చేశారు.