మరోసారి వార్తల్లోకి వచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. విషయం ఏదైనా.. సూటిగా.. సుత్తి లేకుండా అన్నట్లుగా వ్యవహరించే ఆయన.. తానేం చేయాలనుకుంటే అది చేసేస్తుంటారు. ఉమ్మడి అనంతలో తిరుగులేని రీతిలో జేసీ కుటుంబానికి ఉండే పట్టు.. జగన్ ప్రభుత్వంలో ఎంతలా ప్రభావితమైందన్న విషయం తెలిసిందే. ఆయన ఎదుర్కొన్న ప్రతికూలతలు అన్ని ఇన్ని కావు.
అయినప్పటికీ తట్టుకొని నిలిచారు. మరి.. ముఖ్యంగా తాడిపత్రి మున్సిపాలిటీ మీద అధిక్యత కోసం జగన్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన ప్రయత్నాలను ఎదుర్కొని.. తన ఆధిక్యతను ప్రదర్శించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎదుర్కోనన్ని సవాళ్లను జగన్ ఐదేళ్ల పాలనలో ఎదుర్కొన్నట్లుగా చెప్పటం తెలిసిందే. అలాంటి ఆయన.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు.
రెండు.. మూడు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందన్న ఆయన.. కేతిరెడ్డిని అనంతపురం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేయటం తెలిసిందే. కేతిరెడ్డి పెద్దారెడ్డితో పాటు ఆయన ఇద్దరు కుమారుల్ని సైతం రాష్ట్రం నుంచి బహిష్కరించాలని కోరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే పంచె ఊడదీసి కొడతానని హెచ్చరించిన ఆయన.. తాడిపత్రిలో తనకు శత్రువులు ఎవరూ లేరన్నారు.
వైసీపీలో నలుగైదుగురు ఉన్నట్లుగా వ్యాఖ్యానించిన ఆయన.. వారిపైనా చట్టబద్ధంగా చర్యలకు వెళ్లనున్నట్లుగా ప్రకటించారు.
తాడిపత్రిలో ఉండేందుకు తనకు పోలీసుల పర్మిషన్ అవసరం లేదన్న జేసీ.. కేతిరెడ్డి జీవితం మొత్తం గన్ మెన్లతోనే సాగిందన్నారు. పోలింగ్ రోజు కూడా కేతిరెడ్డి తమ కార్యకర్త సూర్యముని ఇంటిపై దాడి చేసిన వైనాన్ని గుర్తించారు. తన ట్రావెల్స్.. తనపైనా పెట్టిన అక్రమ కేసులకు సంబంధించి ఇప్పటికే రవాణా శాఖాధికారులకు.. ఎస్పీకి కంప్లైంట్ చేసినా స్పందన లేదన్న జేసీ.. 24న ఈ అంశాలపై తాను అనంతపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయనున్నట్లు చెప్పారు. ఇందుకు తగ్గట్లే ఈ రోజు (బుధవారం) ఉదయం ఆయన 150 కార్లలో అనంతపురం వన్ టౌన్ పోలీసు స్టేషన్ వద్దకు వచ్చారు.
తనను వేధింపులకు గురి చేసిన మాజీ మంత్రి పేర్ని నాని.. ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు.. డీటీసీలపై కంప్లైంట్ చేస్తానని చెప్పిన ఆయన.. అదే తీరును ప్రదర్శించారు. భారీ వాహన బలగంతో పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన జేసీ.. తనపై నమోదు చేసిన అక్రమ కేసులకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కోరారు. పోలింగ్ రోజున జరిగిన అల్లర్లలో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టిన వైనంపై నిరసన వ్యక్తం చేసిన ఆయన తీరు మరోసారి వార్తాంశంగా మారింది. ఏమైనా.. తాను చేసే ప్రతి పనిని ముందే చెప్పి మరీ చేసే జేసీ నిరసనకు ఏ రీతిలో ఫుల్ స్టాప్ పడుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.