అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ గురించి పరిచయం అక్కర లేదు. జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఈ సోదరులు…నిత్యం తమ వ్యాఖ్యలతో, చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. కొంతకాలంగా తాడిపత్రిలో కొనసాగుతున్న రాజకీయ రగడ…తారస్థాయికి చేరింది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ అధికారుల మధ్య వివాదం చినికిచినికి గాలివానగా మారింది. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో జేసీ ఇచ్చిన ఆదేశాలను అధికారులు, సిబ్బంది పాటించకపోవడం పై జేసీ గుర్రుగా ఉన్నారు.
ఈ క్రమంలోనే జేసీ తనదైన శైలిలో వినూత్నంగా నిరసన తెలిపారు. మున్సిపల్ చైర్మన్ హోదాలో జేసీ ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు, సిబ్బంది గైర్హాజరు కావడంపై జేసీ మండిపడ్డారు. ఈ క్రమంలోనే కొందరు అధికారుల నిబద్ధతను మెచ్చుకుంటున్న జేసీ…మోకాళ్లపై నిలబడి నమస్కారం పెడుతూ తన నిరసన తెలిపారు. దీంతోొ, అధికారులకు జేసీ దండంపెట్టిన వైనం వైరల్ అయింది.
జేసీ సమీక్ష సమయానికే ఎమ్మెల్యే పెద్దారెడ్డి కూడా కరోనా వైరస్ మూడో దశపై అవగాహన ర్యాలీలు, సమీక్ష నిర్వహించారు. దీంతో,
ఎమ్మెల్యే ర్యాలీ, సమీక్ష తర్వాత అధికారులు ఆఫీసుకు వస్తారని జేసీ భావించారు. అయితే, ఎమ్మెల్యేతో సమీక్ష తర్వాత అధికారులు ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో, ఆగ్రహించిన జేసీ…అధికారులు వచ్చేవరకు అక్కడే ఉంటానని బైఠాయించారు.
ముందస్తు సమాచారం ఇవ్వకుండా కమిషనర్ సెలవుపై వెళ్లడంపైనా జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షకు గైర్హాజరైన 26మందికి నోటీసులు జారీ చేశారు. కమిషనర్ వచ్చేదాకా అక్కడే ఉంటానని రాత్రి కూడా కార్యాలయంలోనే బస ఏర్పాటు చేసుకున్నారు.. అక్కడే భోజనం చేసి అక్కడే పడుకున్నారు. ఆ తర్వాత మున్సిపల్ సిబ్బంది తీరుపై ఆగ్రహంతో ఉన్న జేసీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.