సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` చిత్రం టాలీవుడ్ సత్తా ఏంటో మరోసారి నిరూపిస్తోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లు వసూల్ చేసి బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇండియన్ సినిమాగా రికార్డ్ తిరగ రాసింది. బాలీవుడ్ గడ్డపై సైతం పుష్ప మ్యానియా గట్టిగా కనిపిస్తుంది. అయితే నార్త్ లో పుష్ప 2 చిత్రానికి ఎక్కువ థియేటర్స్ కేటాయించటం పట్ల కొందరు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ నటించిన `ఇంటర్స్టెల్లార్` అనే సినిమా 2014లో విడుదలై మంచి విజయం సాధించింది. పదేళ్లు పూర్తైన సందర్భంగా ఈ మూవీని వరల్డ్ వైడ్ గా రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే ఎక్కువ శాతం ఐమాక్స్ థియేటర్లను పుష్ప-2 కు కేటాయించడంతో.. మన దగ్గర ఇంటర్స్టెల్లార్ రీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. ఈ విషయంపై బాలీవుడ్ లో కొందరు ఫైర్ అవుతున్నారు.
పుష్ప 2 కంటే ఇంటర్స్టెల్లర్ను రిలీజ్ చేస్తేనే బాగుండు.. బన్నీ మూవీకి ఎందుకు ఎక్కువ థియేటర్స్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ షురూ చేశారు. అయితే ఈ ట్రోల్స్ పై తాజాగా బాలీవుడ్ తార జాన్వీ కపూర్ రియాక్ట్ అయింది. `పుష్ప-2 కూడా ఒక సినిమానే. ఈ చిత్రాన్ని మరొక దానితో పోల్చి తక్కువ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరు ఏదైతే హాలీవుడ్ మూవీకి సపోర్ట్ ఇస్తున్నారో వారే మన చిత్రాలను మెచ్చుకుంటున్నారు. కానీ మనం మాత్రం మన చిత్రాలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటున్నాం. హాలీవుడ్ చిత్రాలపై పిచ్చితో మన సినిమాల్ని తక్కువ చేయద్దు` అంటూ పుష్ప 2పై విమర్శలు కురిపిస్తున్న వారందరికీ జాన్వీ కపూర్ స్ట్రోంగ్ కౌంటర్ ఇచ్చింది.