జనసేన అధినేత పవన్ కల్యాన్ కు నిలకడ లేదని, పార్ట్ టైం రాజకీయాలు చేస్తుంటారని విపక్ష నేతలు విమర్శిస్తుంటారు. ఆ విమర్శలకు తగ్గట్లే పవన్ కూడా పండక్కో పబ్బానికో అన్నట్లు ప్రెస్ మీట్ లు, ప్రెస్ నోట్లు, మీడియా సమావేశాలు, బహిరంగ సభలు, పర్యటనలు చేస్తుంటారు. అక్కడ కూడా సినిమాల్లో డైలాగులు చెప్పినట్లుగా…ఉద్వేగభరితంగా పూనకంతో ఊగిపోయి..నాలుగు పంచ్ డైలాగులు చెబుతుంటారు. ఆ రకంగా చార్జింగ్ అయిపోయి నిస్సత్తువతో ఉన్న జనసైనికులకు చార్జింగ్ పెడుతుంటారు. ఆ చార్జింగ్ పూర్తయి జనసైనికుల బ్యాటరీ డెడ్ అయ్యేలోపు మరో ఫుల్ ఎనర్జటిక్ స్పీచ్ తో చార్జర్ లా వస్తుంటారు.
అయితే, పార్టీ పెట్టిన కొత్తలో రెండు రాష్ట్రాల రాజకీయాల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పిన పవన్…ఆ తర్వాత మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కాలు కాదుగదా…వేలు కూడా పెట్టలేదు. ఈ క్రమంలోనే తన నిలకడ లేమిని, రాజకీయ అస్థిరతను మరోసారి బయటపెట్టుకున్న పవన్…ఇకపై, తెలంగాణలో జనసేన పార్టీ జెండా ఎగరేస్తానంటూ దశ దిశ లేని పవనం(గాలి)లాగా పవన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. అయితే, మోడీ డైరెక్షన్ లోనే ఏపీలో జగన్ తో పాటు తెలంగాణలో కేసీఆర్ పై పవన్ వార్ కు రెడీ అయ్యారని టాక్ వస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కచ్చితంగా పోటీ చేస్తామని పవన్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. పోలీసు ఉద్యోగాల వయో పరిమితి సడలింపుపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని అన్నారు. యువత బలమే జనసేనకు ప్రధాన ఆయుధమని చెప్పారు. తెలంగాణ రాజకీయాల్లో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.
నల్లగొండకు బయలుదేరే ముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద, సికింద్రాబాద్, మెట్టుగూడ, ఎల్బీ నగర్ వద్ద ఆగుతూ అభిమానులు, కార్యకర్తలతో పవన్ మాట్లాడారు. ఈ సందర్భంగా మెట్టుగూడ వద్ద పవన్ కల్యాణ్ కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. పవన్ ను భారీ గజమాలతో సత్కరించారు. ఇక, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటిస్తోన్న పవన్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయిపార్టీ సభ్యుడు కొంగరి సైదులు ఇంటికి వెళ్లారు. సైదులు భార్య సుమతిని ఓదార్చని పవన్…ఆమెకు రూ.5లక్షల బీమా చెక్ ను అందించారు. జనసేన క్రియాశీల కార్యకర్తలకు, పార్టీ సభ్యులకు జనసేన ఎల్లపుడూ అండగా ఉంటుందని పవన్ అన్నారు.