ప్రముఖ బిల్డర్, హైదరాబాద్ లో స్థిరపడిన జనసేన నాయకుడు కుప్పాల మధు దారుణహత్యకు గురయ్యాడు. కర్ణాటకలోని బీదర్ లో ఈ సంఘటన జరిగింది. స్నేహితులతో డబ్బు విషయంలో జరిగిన వివాదంతో బీరుబాటిళ్లతో వారు విచక్షణ రహితంగా పొడిచి పరారయినట్లు తెలుస్తుంది. అతని వద్ద ఉన్న 20 లక్షల విలువైన బంగారం, రూ.కోటి నగదు తీసుకుని ఉడాయించినట్లు తెలుస్తుంది.
కోనసీమ జిల్లా అమలాపురం కు చెందిన మధు 30 ఏళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డాడు. కుత్బుల్లాపూర్‌లో మణికంఠ ట్రావెల్స్ పేరుతో కార్లు అద్దెకిచ్చేవాడు. తర్వాత బిల్డర్ గా ఎదిగాడు. క్యాసినో ఆటలో అతనిది మొదటి నుండి అందెవేసిన చేయి అని తెలుస్తుంది. క్యాసినో ఏజెంట్‌గా మారిన మధు గోవా, మలేసియా, బెంగళూర్, కర్ణాటక, సింగపూర్, దుబాయ్‌లకు వెళ్లి క్యాసినోలో పాల్గొనేవాడని సమాచారం. జనసేన నాయకుడిగా ఉన్న మధు పిఠాపురంలో జగన్ కు మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించాడు. తన గ్రామంలో ఇటీవల ఇల్లు కూడా కట్టుకున్నాడు.
ఇప్పటికే పెద్ద కుమార్తె పెళ్లి చేసిన మధు రెండు కూతురు పెళ్లి ఆగస్టులో చేయాలని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఎన్నికల తర్వాత ఏపీ నుండి ఈ నెల 23న వచ్చిన మధు తన స్నేహితులు రేణుకా ప్రసాద్, నిఖిత్, పి.గోపీలతో కలిసి బయటకు వెళ్లాడు. తర్వాత భార్యకు కాల్ చేసి తాను స్నేహితులతో బీదర్ వెళ్తున్నానని చెప్పాడు. అదే రోజు ఇంటికి వస్తున్నానని చెప్పి ఆ తర్వాత శవమై కనిపించాడు.
ఆ రోజు కేసినోలో మధు బాగా డబ్బు గెలిచాడని, తిరుగు ప్రయాణంలో డబ్బుల విషయంలో గొడవ జరిగి స్నేహితులు హత్య చేశారని చెబుతున్నారు. దాదాపు రూ.60 లక్షల నుండి రూ.కోటి నగదు, 20 లక్షల విలువైన బంగారం ఉంటుందని అంటున్నారు. ఆదివారం కుత్భుల్లాపూర్ లో జరిగిన మధు అంత్యక్రియలకు స్నేహితులు రాకపోవడమే ఈ అనుమానాలకు కారణంగా తెలుస్తుంది.