జనసేన మార్చి నెలలో ప్లీనరి సమావేశాలను జరపనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉనికిలో ఉన్నప్పటికీ 2024లో నుంచి అధికారాన్ని రుచి చూస్తున్నది. అందువల్ల, ఈ పార్టీపైన కొంత లోతైన విశ్లేషణ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.
1950వ దశకం నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ‘కాపు’ సామాజికవర్గం సాంప్రదాయకంగా కాంగ్రెసుకు బలమైన ఓటుబ్యాంకు. అయితే 2014లోనే తొలిసారిగా తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. అందువల్ల కోస్తాంధ్రలోని కమ్మ, కాపు కులాల మధ్య ఉన్న వైరం మైత్రిగా మారింది. ఫలితంగా తొలిసారి తెలుగుదేశం పార్టీ కాపు సామాజిక వర్గం నుంచి 60% ఓట్లకు పైగా పొందింది. ఇది అనుహ్యమైన ఓటు బ్యాంకు కాబట్టి ఈ అంశాన్ని విశ్లేషించాలి.
కమ్మ, కాపు మధ్య ఉన్న సామాజిక వైరుధ్యాలు రాజకీయంగా 1980వ దశకంలో స్పష్టంగా బయటపడ్డాయి. 1982లో వంగవీటి మోహనరంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాపునాడును ఏర్పాటు చేశారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. ఈ రెండు రాజకీయ సంఘటనలకు కేవలం 8 నెలల తేడా మాత్రమే. అయితే కాపునాడు కాంగ్రెసుకు అనుబంధంగా ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీకి దగ్గర కాలేకపోవడమే కాకుండ, ఆ పార్టీ విజయాన్ని ఆపలేక పోయింది. తదనాంతర పరిణామాలు ఈ వైరుధ్యాలను ఇంకా జటిలం చేశాయేగాని ‘సామాజిక మైత్రి’కి మాత్రం దారులు వేయలేకపోయాయి.
1990వ దశకంలో ప్రముఖ సినిమా దర్శకుడు దాసరి నారాయణరావు పార్టీ పెడతానని ప్రకటించిన వెంటనే కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్రంలో మంత్రిని చేయడంతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. 1992-93లో సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి, వెనుకబడిన కులాలకు 27% రిజేర్వేషన్లు కేంద్రభ్రుత్వ ఉద్యోగాలల్లో అమలు ప్రారంభమైంది. అయితే కొంతకాలానికి కాంగ్రెసు నేత ముద్రగడ పద్మనాభం ‘కాపుల’ను ఇతర వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలాని ఆందోళన ప్రారంభించారు. చాలా కాలంపాటు కాపుల డిమాండ్‌కు పెద్దగా రాజకీయ పార్టీల నుండి మద్దతు లభించలేదు.
కాపుల్లో పెరుగుతున్న అసంతృప్తి పునాదిగా సినీనటుడు కొణిదెల చిరంజీవి 2009లో ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే 2009 ఎన్నికల్లో అనుకున్నంత స్థాయిలో ఫలితాలు దక్కక పోవడంతో చిరంజీవి పార్టీని కొనసాగించాలా వద్దా అన్న సందేహానికి లోనయ్యారు. ఇదే అదనుగా భావించిన కాంగ్రెస్ చిరంజీవికి కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వడంతో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఫలితంగా ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకమైన దేవేందర్ గౌడ్, తమ్మినేని సీతారామ్ లాంటి వాళ్ళు రాజకీయ ఉనికిని కోల్పోవలసి వచ్చింది. అయితే తమ్మినేని సీతారామ్ వైసీపీలో చేరి రాజకీయ పునరావాసం పొందారు. ఆనాటి ప్రజారాజ్యంపై ఆశలు పెట్టుకున్న అనేక సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున అసంతృప్తికి గురైనట్లు పరకాల ప్రభాకర్ విశ్లేషించారు. అలాగే మిత్రలాంటివారు రాజకీయాలకు దూరమైయ్యారు.
ఇటువంటి రాజకీయ విపత్తు నేపథ్యంలో ‘కొణిదెల కుటుంబం’ నుండి వచ్చిన సినీ నటుడు, చిరంజీవి తమ్ముడు 2014లో ఎన్నికల ముందు ‘జనసేన పార్టీ’ని ప్రారంభించారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ, బీజేపీకి మద్దతు ప్రకటించడంతో పాటు ప్రచారాన్ని చేయడం వల్ల కోస్తాంధ్ర కాపు సామాజిక వర్గం నుండి తొలిసారిగా కూటమికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. అదే విధంగా 2018 నాటికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగు దేశం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య వివాదాలు తలెత్తడం వల్ల కూటమి మైత్రి విచ్ఛిన్నమైంది.
రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న పార్టీలకు దూరమైన జనసేన 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలలో పోటీ చేశారు. 2019 ఎన్నికలలో జనసేన కూటమి ఘోర పరాజయం పొందడమే కాకుండా, కేవలం 7.5% ఓట్లకు పరిమితం అయ్యింది. ఒక్క శాసన సభలో మాత్రమే గెలిచింది. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కూడా ఓడిపోయారు. పార్టీనే కనుమరుగు అయ్యే పరిస్థితి వచ్చింది. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైపీసీకి ఓటు వేయడం ఆ పార్టీ ఇతర సామాజిక వర్గాల మద్దతుతో అధికారంలోకి వచ్చింది. అయితే బలహీన పడిన జనసేనను అధినాయకత్వంలోని పవన్ కళ్యాణ్, ద్వితీయ స్థానంలో ఉన్న నాదెళ్ల మనోహర్ వైసీపీ పాలనలో కూడా పార్టీని నిలబెట్టుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన మనోహర్ ఆ పార్టీలో ఉండడం ఆ కులానికి దగ్గరవ్వడానికి అనుకూలించింది.
వైసీపీ పాలనలో చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం, పవన్ కళ్యాణ్ చంద్రబాబును రాజమండ్రి కేంద్ర జైల్లో కలవడం వల్ల టీడీపీ, బీజేపీ, జనసేన మైత్రికి బలమైన పునాదులు వేసింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పవన్‌కళ్యాణ్ సభలు నిర్వహించటంతో పాటు మరోవైపున బీజేపీకీ, తెలుగుదేశానికి సయోధ్య కుదర్చటంలో కీలక పాత్ర పోషించారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని సాధించింది. ఇందులో జనసేన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాలను సొంతంచేసుకొని, 4.5% ఓటు బ్యాంకును సంపాదించి రాష్ట్ర, కేంద్ర మంత్రి వర్గంలో చేరింది. రాష్ట్రంలో జనసేన కీలక నాయకులైన పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖను తీసుకోగా మనోహర్ మరోశాఖకు మంత్రి అయ్యారు. పవన్ కళ్యాణ్ పంచాయితీ రాజ్, గ్రామిణాభివృద్ధి శాఖను స్వీకరించిన వెంటనే కరువు ప్రాంతాలల్లో అమలయ్యే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కోస్తాంధ్రలో పెంచే ఉద్యానవనానికి వర్తింపజేయడం, గ్రామసభలు వంటి చర్యలు చేపట్టారు. గ్రామ సభ నిర్వహించిన విధానం చాలా వివాదాలకు గురైంది. ఇందులో ప్రధానంగా గ్రామసభ నిర్వహణ తీరు ప్రభుత్వ అధికారుల పర్యటనగా మాత్రమే జరిగింది. ఈ సభలలో ఆశించినంతగా ప్రజల భాగస్వామ్యం లేదు. అంతేకాకుండ గ్రామసభలు ప్రజల క్షేమం కొరకు కాకుండ, ఒక అంతర్జాతీయ సంస్థ సర్ట్టిఫికేట్ కోసం జరిగిందని విమర్శరాగా మరొక విమర్శ కేంద్ర పర్యావరణ పరిరక్షణమంత్రిత్వ శాఖ 2008లోనే ‘ఫ్లెక్సీ’ బ్యానర్స్ను నిషేధించినప్పటికీ, గ్రామసభల నిర్వహణకు వాటిపైన కొన్ని ప్రభుత్వ కార్యక్రమాల పేర్లు, ప్రాధాన్యాలు మాత్రమే ప్రభుత్వ అధికారులు చదివి తూతూ మంత్రంగా పూర్తి చేశారే గాని, గ్రామ సభలో గ్రామ ప్రజల భాగస్వామ్యం ఒక్కశాతం కూడా లేదనేది స్పష్టంగా సామాజిక మాధ్యమంలో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి. ఒక్కొక్క ప్రభుత్వ అధికారి ఒక్క రోజులో నాలుగు గ్రామసభలు నిర్వహిస్తుండడం వల్ల స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల రాకకొరకు ఎదురు చూడ వలసివచ్చిందేకాని, ప్రజల భాగస్వామ్యం గ్రామసభలో లేదని ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల నుండి తెలియజేశారు.
జనసేన నిర్వహించిన సమావేశాల్లో స్థానిక సంస్థలలో ఎంతో ఆర్భాటం చేసి, ఒక ఊపుతీసుకు వచ్చిన పార్టీ, అధికారంలోకి వచ్చిన ఆరునెలలో ఆ సంస్థల బలోపేతానికి చేసింది ఏమి లేదని ప్రజాప్రతినిధులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అదే విధంగా జనసేన నాయకత్వం అనేక వివాదాలకు గురవుతున్న సందర్భంలో ప్లీనరీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఒక ప్రక్క సుప్రసిద్ధ రాజనీతి శాస్త్రవేత్త, ప్రొఫెసర్ జి.హరగోపాల్ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 2024 లోక్‌సభ ఎన్నికలపై జరిగిన సదస్సులో పవన్ కళ్యాణ్ రాజకీయాధికారాన్ని ఏ ఉద్దేశ్యం కొరకు ఉపయోగిస్తున్నారో ఎవరికి తెలియదని వ్యాఖ్యానించారు.
ఇటువంటి సందర్భంలో జనసేనకి అనేక సవాళ్ళు ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు పార్టీ కోస్తాంధ్ర కాపు సామాజిక వర్గానికి పరిమితమైంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఎన్డీయే మంత్రివర్గంలో చేరనున్నట్లు ప్రకటించారు. అందువల్ల ఇప్పటికీ కుటుంబ పార్టీలు పాలిస్తున్న రాష్ట్రంలో మరొక ‘కొణిదెల కుటుంబ’ పార్టీ చేరునుంది. టీడీపీ, బీజేపీ కూటమిలో చేరడం వల్ల కమ్మ, వెనుకబడిన జాబితాలో ఉన్న శెట్టి బలిజల ఓట్లు జనసేనకు వచ్చాయి. అదే విధంగా కాపుల ఓట్లు కూటమికి వచ్చాయి. అయితే జనసేనలో వెనుకబడిన కులాలకు దళితులకు ప్రాధాన్యత లేదని మరొక విమర్శ ఉంది. అంతేకాకుండా కూటమిలో భాగస్వామ్యమైతేనే కొన్ని సీట్లు గెలవగలుగుతుంది. కూటమి విచ్ఛిన్నమైతే ఓటమి పాలవుతుందని 2019 ఎన్నికలు తేల్చాయి. ఇటువంటి గడ్డు పరిస్థితులల్లో జనసేనఎంతకాలం కూటమిలో కొనసాగుతుంది. ఒక వేళ కొనసాగిన పార్టీ కార్యకర్తలు అందుకు సిద్ధంగా ఉన్నారా? వామపక్ష పదజాలంతో మొదలై సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ పార్టీ ఏ దిశలో నడిపించనున్నారు. ఇటువంటి విషయాలకు సమాధానం లేక పార్టీ సిద్ధాంతకర్తలు, వ్యూహకర్త తలపట్టుకున్నట్టు వినికిడి.
– ప్రొఫెసర్ ఇ. వెంకటేశు
రాజనీతి శాస్త్ర విభాగం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం