ఏపీలో జగన్ సర్కారుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు. తాజాగా ఆయన ఇటీవల పరిషత్ ఎన్నికల్లో జనసేన సాధించిన ఓట్లు.. సీట్లు.. గెలిచిన వారి వివరాలకు సంబంధించిన అప్డేట్ను స్వయంగా లెక్కలతో సహా వివరించారు. తమ పార్టీ పుంజుకుంటోందని.. బిందువుతో ప్రారంభమైన తమ పార్టీ సింధువుగా మారిందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యేతో మొదలైన తమ రాజకీయ ప్రయాణం.. ఇప్పుడు పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుకుంటోందని చెప్పుకొచ్చారు.
అయితే.. పరిషత్ ఎన్నికల్లో ఎంపీటీసీల్లో 21 శాతం పైచిలుకు ఓట్లు.. సాధించామన్న.. పవన్.. జడ్పీ ఎన్నికల్లో 11 శాతం ఓట్లు సాధించామని.. అయితే.. కొన్ని సంస్థాగత సమస్యలను అధిగమించాల్సి ఉందని..అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. తమకు ఇప్పటికిప్పుడు అధికారంలోకి రావాలని లేదని.. అదికారమే పరమావధిగా పార్టీ పెట్టలేదని.. తమ దృష్టిలో ఈ విజయం.. పెద్దదేనని.. చెప్పుకొన్న పవన్.. దీనికి కొందరు తక్కువ చేసి చూపించొచ్చన్నారు. అయితే.. అదేసమయంలో తన పార్టీని.. తెలంగాణలోకి కేసీఆర్ పార్టీ.. టీఆర్ ఎస్తో పోల్చుకున్నారు.
తెలంగాణలోనూ.. కేసీఆర్ పార్టీ ఇలానే ప్రారంభమై.. అధికారంలోకి వచ్చిందని.. ఇక్కడ ఏపీలోనూ తాము అదే తరహాలో ప్రజల్లోకి వెళ్తామన్నారు. ఈ సందర్భంగా పరిషత్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు దాష్టీకానికి పాల్పడుతున్నారని.. దుయ్యబట్టారు. అంతేకాదు.. పరిషత్ షెడ్యూల్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఉండడం.. ఎన్నికల కమిషన్.. చోద్యం చూసిందని, మంత్రులే స్వయంగా రెచ్చిపోయారని.. బలవతంగా.. నామినేషన్లను ఉపసంహరించే పనిచేపట్టారని.. తాము మాత్రమే అధికారంలో ఉండాలనేలా క్రూరంగా వ్యవహరించారని చెప్పుకొచ్చారు.
దీంతో జనసేన తరఫున తక్కువ మందే పోటీలో ఉన్నారని అన్నారు. ప్రజాస్వామ్యం గురించి లెక్చర్లు ఇచ్చే వైసీపీ నాయకులు.. ఎన్నికల్లో ఎలా వ్యవహరించారో.. చెప్పడానికి మాటలు చాలడం లేదన్న పవన్.. ఏపీలో జరిగిన దారుణాలు, దాష్టీకాలు.. దేశంలో ఎక్కడా జరగలేదని.. దేశంలోనే ఇలాంటి దరిద్రమైన.. దాష్టీకమైన పరిస్థితి లేదని.. నిప్పులు చెరిగారు. అంతేకాదు.. మరో సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న పాలనపై మాట్లాడతానన్నారు. అంతేకాదు..బీజేపీకి తాము ఎక్కువ స్థానాలు ఇచ్చినా.. బలంగా ప్రయత్నిస్తే.. బాగుండేదని.. ఎక్కడ లోపం జరిగిందో తమ మిత్రపక్షంతో చర్చిస్తామన్నారు.