తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు కోసం అన్ని పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ రోజుతో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో పలువురు అభ్యర్థులకు ఎన్నికల అధికారులు షాకిచ్చారు. కొందరు అభ్యర్థుల నామినేషన్లను అధికారులు తిరస్కరించడంతో వారికి షాక్ తగిలినట్లయింది. నాగార్జున సాగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నామినేషన్ కూడా తిరస్కరణకు గురి కావడం విశేషం.
వాస్తవానికి ఆ స్థానం నుంచి జానారెడ్డి తనయుడు జై వీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జానారెడ్డి నామమాత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ నామినేషన్ తో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రెండు నామినేషన్లు, కరీంనగర్ మానకొండూరులో ఏడు నామినేషన్లు, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి మూడు నామినేషన్లు తిరస్కరించారు. సరైన పత్రాలు సమర్పించకపోవడం, పలు సాంకేతిక కారణాలతో ఈ నామినేషన్లు తిరస్కరించారు.
ఇక, బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ నామినేషన్ రద్దు చేయాలని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. పువ్వాడ 4 సెట్ల నామినేషన్ లో తప్పులున్నాయని, రిజెక్ట్ చేయాలని ఆయన కోరారు. అంతేకాదు, ఆర్ఓ నిబంధనలను పాటించడం లేదని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. బీఆర్ఎస్ అరాచకాలు, అక్రమాలు ఎక్కువైపోయాయని, చక్రవడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని తుమ్మల వార్నింగ్ ఇచ్చారు.