గడిచిన కొద్దికాలంగా తెర మీదకు వస్తున్న జమిలి ఎన్నికలపై తొలిసారి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోడా కీలక వ్యాఖ్యలు చేశారు. గడిచిన కొద్దికాలంగా జమిలి ఎన్నికల అంశం తరచూ ఎవరో ఒకరు ప్రస్తావిస్తున్నారు. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. త్వరలోనే జమిలి ఎన్నికలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకునే వీలుందని.. నేతలు.. కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలనటం గమనార్హం.
ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయిస్తే.. జమిలి ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధమేనని పేర్కొన్నారు. ఒక ఆంగ్ల ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనీ వ్యాఖ్య చేశారు. అయితే.. జమిలి ఎన్నికల నిర్వహణకు చట్టాల్లో కొన్ని సవరణలు అవసరమ్నారు. ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘానికి నేరుగా నిర్ణయం తీసుకోవటానికి అధికారం లేదన్న ఆయన.. ఎన్నికల్ని నిర్వహించటానికి సిద్ధమన్న మాటను చెప్పటం గమనార్హం.
జమిలి ఎన్నికల అంశాన్ని ప్రధాని మోడీ ప్రస్తావించిన స్వల్ప వ్యవధిలోనే సునీల్ ఆరోడా నోటి నుంచి ఇదే అంశాన్ని ప్రస్తావించటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికల ఖర్చు పెరుగుతోందని.. తరచూ ఏదో ఒక ఎన్నికలు జరగటం కారణంగా.. డెవలప్ మెంట్ పనులపైనా ప్రభావం పడుతుందన్నారు.
జమిలి ఎన్నికల్లో భాగంగా దేశ వ్యాప్తంగా లోక్ సభ.. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించాలన్నది బీజేపీ ఆలోచన.. అయితే.. ప్రధాన విపక్షం కాంగ్రెస్ తో పాటు పలు రాజకీయ పార్టీలు.. ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు.