జైలర్ .. వారం రోజులుగా సౌత్ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సినిమా. సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో ఆయన్ని ఢీకొట్టే విలన్ పాత్రలో నటించి మెప్పించాడు వినాయకన్. వర్మ పాత్రలో వినాయకన్ పెర్ఫామెన్స్ ప్రశంసలు అందుకుంటోంది. ఓవైపు కరడు గట్టిన రౌడీ పాత్రలో వయొలెన్స్ చేస్తూనే.. మరోవైపు పాటలు పెట్టుకుని తన గ్యాంగ్‌తో కలిసి డ్యాన్సులు చేస్తూ చిల్ అయ్యే పాత్రలో వినాయకన్ అదరగొట్టాడు.
ఈ సినిమా చూశాకే చాలామంది ఎవరీ నటుడు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వినాయకన్ మలయాళీ. చూడ్డానికి మరీ ఎక్కువ వయసున్నట్లు కనిపించడు కానీ.. వినాయకన్ 1995లోనే నటుడిగా అరంగేట్రం చేయడం విశేషం. ఐతే అతడికి 2000 తర్వాతే గుర్తింపు వచ్చింది. చూస్తుండగానే బిజీ ఆర్టిస్టు అయిపోయిన వినాయకన్.. పెద్ద పెద్ద సినిమాల్లో విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ రోల్స్ కూడా చేశాడు.
వినాయకన్ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. 2006లోనే అతను తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అసాధ్యుడు’లో అతను సైకో తరహా విలన్ పాత్రలో నటించాడు. కథను కీలక మలుపు తిప్పేది అతడి పాత్రే. ఆ తర్వాత విశాల్ సినిమా ‘తిమురు’లోనూ అతను విలన్ పాత్ర చేశాడు. అది తెలుగులోకి ‘పొగరు’ పేరుతో అనువాదం అయింది. విలన్ పాత్రలకు సరిపోయే రూపం ఉండటం వినాయకన్కు పెద్ద ప్లస్. కెరీర్లో చాలా వరకు అతను నెగెటివ్ రోల్సే చేశాడు. తమిళంలో ఇప్పటికే పది సినిమాల దాకా నటించినప్పటికీ.. ‘జైలర్’తో వచ్చిన గుర్తింపే వేరు.
రజినీ సినిమాలో మెయిన్ విలన్ రోల్ అంటే చిన్న విషయం కాదు. పైగా సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో వినాయకన్ అందరి దృష్టిలో పడ్డాడు. వినాయకన్ గాయకుడు కూడా కావడం విశేషం. దుల్కర్ సల్మాన్ సినిమా ‘కమ్మట్టి పాదం’ సహా కొన్ని సినిమాల్లో అతను పాటలు పాడాడు. ‘జైలర్’ తర్వాత అతను నటుడిగా మరింత బిజీ అవుతాడనడంలో సందేహం లేదు.