కడప జైలు ఇన్చార్జి సూపరింటిండెంట్ పోచా వరుణారెడ్డి నియామకంపై కొద్ది రోజులుగ పెను దుమారం రేగిన సంగతి తెలిసిందే. ట్రాక్ రికార్డు పరంగా పలు ఆరోపణలున్న వరుణారెడ్డిని వివేకా మర్డర్ కేసు నిందితులున్న కడప జైలు సూపరింటిండెంట్ గా నియమించడంపై విమర్శలు వచ్చాయి. వరుణా రెడ్డి నియామకాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తప్పుబట్టారు. వివేకా హత్య కేసు నిందితుల హత్యకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
గతంలో పరిటాల రవి హత్య కేసు నిందితుడు మొద్దు శ్రీను హత్య సమయంలో అనంతపురం జైలర్ గా ఉన్న వరుణా రెడ్డిని ప్రస్తుతం కడప జైలర్ గా నియమించడం వెనుక కుట్ర ఉందని ఆరోపించారు. అంతేకాదు, ఆ నియామకంపై సీబీఐకి లేఖ రాస్తామని కూడా అన్నారు. మరోవైపు, వరుణా రెడ్డిపై అనేక శాఖపరమైన కేసులు ఉన్నాయని, వివేకా హంతకులు రిమాండ్‌లో ఉన్న జైలుకే వరుణారెడ్డి జైలర్‌గా రావడం పలు అనుమానాలకు తావిస్తోందని సీబీఐ డైరెక్టర్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య కూడా లేఖ రాశారు.
కడప జైలులో ఉన్న వివేకానంద రెడ్డి హంతకులకు ప్రాణహాని ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప జిల్లా జైలర్ వరుణారెడ్డిని బదిలీ చేయాలని కోరారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఒత్తిడితో వరుణారెడ్డిపై బదిలీ వేటు పడింది. ఒంగోలు జైలర్ గా వరుణా రెడ్డిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒంగోలు జైలు సూపరింటిండెంట్ గా ఉన్న ప్రకాశ్ ను కడప జైలర్ గా బదిలీ చేశారు.