సంబంధం లేని విషయాల్లో కాళ్లు.. వేళ్లు కాకుండా ఒళ్లంతా పెట్టేసే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సరైన రీతిలో సమాధానం ఇచ్చారు భారత విదేశాంగ శాఖా మంత్రి జైశంకర్. సమకాలీన కాలంలో విదేశాంగ మంత్రులుగా నోటి మాటలతో అందరి మనసుల్ని దోచుకున్న నేత ఎవరైనా ఉన్నారంటే అది జైశంకర్ అవుతారు. దివంగత సుష్మా స్వరాజ్ తీరు వేరు. ఆమె.. హుందాగా వ్యవహరిస్తారు.
ఆ మాటకు వస్తే విదేశాంగ మంత్రిగా ఆమె ఆ పదవికే వన్నె తెచ్చారు. జైశంకర్ లెక్క కాస్త వేరుగా ఉంటుంది. మంచిగా ఉండే వారితో మంచిగా ఉండే ఆయన.. కాస్త తేడాగా మాట్లాడినా.. మళ్లీ మాట్లాడకుండా బదులు ఇచ్చే సత్తా జైశంకర్ సొంతమని చెప్పాలి.
ఇటీవల కాలంలో ట్రంప్ గొప్పల్ని చూస్తునే ఉన్నాం. భారత్ – పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని.. ఆణు యుద్ధాన్ని తాను హెచ్చరించటం ద్వారానే రెండు దేశాలు దారికి వచ్చినట్లుగా చెప్పిన.. చెబుతున్న గొప్పలు అన్ని ఇన్ని కావు. ఇలాంటి వేళ.. ఈ అంశంపై భారత రాజకీయాల్లో మాత్రం ప్రధాని నరేంద్ర మోడీని తప్పు పడుతున్నారు.
ట్రంప్ దూకుడుకు కళ్లాలు వేయాలని కోరుతున్న వారి సంఖ్య తక్కువేం కాదు. కాకుంటే.. ట్రంప్ ను మొండి.. మూర్ఖ ట్రంప్ గా కాకుండా.. అమెరికా దేశంగా చూడటం.. చిన్న విషయాలకు ఎక్కువగా స్పందించకూడదన్న పెద్ద మనసుతో భారత ప్రధాని ఆచితూచి అన్నట్లుగా రియాక్టు అవుతున్నారు.
ఇదిలా ఉంటే..భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మాత్రం కాస్త భిన్నంగా రియాక్టు అయ్యారని చెప్పాలి. పాకిస్థాన్ కు ఆయుధాల్ని ఎక్కువగా ఎగుమతి చేసే రెండో అతి పెద్ద దేశం నెదర్లాండ్స్. ఆ దేశానికి చెందిన ఒక టీవీ చానల్ కు భారత విదేశాంగ మంత్రి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. భారత్ – పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావించిన వేళ.. జైశంకర్ బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమ రెండు దేశాల ప్రతినిధులు మాట్లాడుకునేందుకు అవసరమైన హాట్ లైన్ వ్యవస్థ తమకు ఉందన్న జైశంకర్.. ‘మే 10న పాకిస్తాన్ ఆర్మీ నుంచి మాకో సందేశం వచ్చింది. కాల్పులు ఆపేందుకు తాము సిద్దమన్నది వారి నుంచి వచ్చిన మెసేజ్ సారాంశం’ అని అప్పుడు జరిగిందేమిటో వెల్లడించారు. మరి.. ఈ ప్రక్రియలో అమెరికా ఎక్కడ ఉందంటూ సదరు ఇంటర్వ్యూలో మరో ప్రశ్న ఎదురైంది. దీనికి అంతే సెటిల్డ్ గా బదులిచ్చిన జైశంకర్.. ‘అమెరికా .. అమెరికాలోనే ఉంది’ అంటూ సూటిగా బదులిచ్చిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అప్పట్లో జరిగిన పరిణామాలను ఈ ఇంటర్వ్యూ సందర్భంగా జైశంకర్ వివరించారు.
ఆయన మాటల్లోనే చదివితే.. ‘‘అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. ఆ దేశ విదేశాంగ మంత్రి నాకు ఫోన్ చేశారు. వారు పాకిస్తాన్ తోనూ మాట్లాడారు. ఒక్క అమెరికాతోనే కాదు మిగిలిన దేశాలు కూడా భారత్ తో సంప్రదింపులు జరిపాయి. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉన్నప్పుడు.. ఇతర దేశాల నుంచి కాల్స్ రావటం సహజమే. కాల్పుల విరమణ గురించి భారత్ – పాక్ నేరుగా మాట్లాడుకున్నాయి.
కాల్పులు ఆగాలంటే వారు నేరుగా మాతో మాట్లాడాలని అమెరికాతో సహా అన్ని దేశాలకు స్పష్టం చేశాం’’ అని చెప్పారు. పాకిస్తాన్ నుంచి నేరుగా ఫోన్ వస్తే తప్పించి కాల్పుల విషయంలో తగ్గేది ఉండదన్న విషయాన్ని భారత్ స్పష్టం చేసిన వైనాన్ని జైశంకర్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టం చేశారని చెప్పాలి. ఈ ఇంటర్వ్యూ చాలు.. ట్రంప్ గొప్పల గాలి తీసేశారనటానికి.