దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయురాలు, ఏపీ సీఎం వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. షర్మిల కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. షర్మిల జగన్ వదిలిన బాణం అని కొందరంటుంటే…కేసీఆర్ వదిలిన బాణం అని మరికొందరంటున్నారు. అసలు, షర్మిల పార్టీ వెనుక అమిత్ షా ఉన్నారని ఇంకొందరంటున్నారు.
ఈ నేపథ్యంలో షర్మిల పెట్టబోయే పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ మొదలుపెట్టిన డ్రామా ఇదని, కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి సామాజిక వర్గాన్నివిడదీసేందుకే షర్మిల పార్టీ అని షాకింగ్ కామెంట్లు చేశారు. ఇప్పుడు షర్మిల వచ్చారని.. రేపు జూనియర్ ఎన్టీఆర్ లేదా ఎన్టీఆర్ కుటుంబంలో నుంచి మరొకరు వస్తారని వ్యాఖ్యానించారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు లేకుంటే తాను లేనని, రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే తన జీవితాశయమని వైఎస్ రాజశేఖర రెడ్డి చాలాసార్లు అన్నారని జగ్గారెడ్డి గుర్తు చేశారు. రాజన్న రాజ్యం రావాలని, వైఎస్ వారసురాలిని అని చెప్పుకునే షర్మిలకు ఇది పట్టదా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ కూతురిగా ఆయన కోరిక తీర్చాల్సిన షర్మిల.. కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు చేరలేదని ప్రశ్నించారు.
షర్మిల సొంత పార్టీ కాకుండా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చేరి, తండ్రి ఆశయాన్ని సాధించవచ్చు కదా అని నిలదీశారు. షర్మిల అలా చేయకుంటే వైఎస్ ఆత్మ శాంతించదని, తండ్రి ఆశయానికి విరుద్ధంగా వెళుతూ షర్మిల తప్పు చేస్తోందని విమర్శించారు. హైదరాబాద్ పొలిటికల్ టూరిస్ట్ ప్లేస్ లా తయారైందని.. తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ క్రీడను అర్థం చేసుకోవాలని జగ్గారెడ్డి అన్నారు. కేసీఆర్, జగన్, అసదుద్దీన్, షర్మిల.. అవన్నీ అమిత్ షా సంధించిన బాణాలేనని తేల్చేశారు.