ఇటీవలి కాలంలో ఏపీ సీఎం జగన్ వరుసగా యూటర్న్ లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లుపై వెనక్కు తగ్గిన జగన్..తాజాగా మరో జీవోను వెనక్కు తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ మహిళా కార్యదర్శులకు సంబంధించిన జీవో నంబర్ 59ను ఉపసంహరించుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన ఈ జీవోను వెనక్కు తీసుకుంటున్నామని హైకోర్టుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది వెల్లడించారు.
అయితే, మహిళా కార్యదర్శులను ఉన్నపళంగా పోలీసులుగా నియమించేందుకు దోహదమైన జీవో 59ను సవాలు చేస్తూ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరుగుతున్న నేపథ్యంలోనే ప్రభుత్వం ఆ జీవోను వెనక్కు తీసుకుంది. వారికి పోలీసుల్లాగే డ్రెస్ కోడ్ ఉండాలన్న నిబంధనలను కూడా వెనక్కి తీసుకుంంది. అయితే, వారిని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, దానిపై అఫిడవిట్ దాఖలు చేస్తామని వెల్లడించింది. దీంతో, తదుపరి విచారణను వచ్చేవారానికి వాయిదా పడింది.
జీవో నంబర్ 59 ప్రకారం కానిస్టేబుల్‌కు ఉండే సర్వాధికారాలు, బాధ్యతలు మహిళా కార్యదర్శులకుంటాయి. దీంతో, ఈ జీవోను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ జీవో ఏపీ డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్‌లోని సెక్షన్ 1, 6, 11, 21తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కోర్టులో ఆ జీవోపై వాదనలు జరుగుతుండగానే ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది.