సైలెంట్ గా గవర్నర్ ప్రసంగం జరుగుతుండగా సభలోకి వచ్చామా….అంతే సైలెంట్ గా ఆయన ప్రసంగం మొదలుబెట్టిన 10 నిమిషాలకే సభ నుంచి వాకౌట్ చేశామా…అన్న రీతితో వైసీపీ సభ్యులు వ్యవహరించారు. ఇంకో 60 రోజులపాటు అసెంబ్లీ గడప తొక్కే పనిలేదు అంటూ వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా సంబరపడిపోయారు. కానీ, జగన్ కు ఆ ఆనందాన్ని కాసేపు కూడా ఉండనివ్వకుండా అసెంబ్లీ అధికారులు ఆయనకు షాక్ ఇచ్చారు. ఈ రోజు జగన్ తో పాటు ఏ సభ్యుడి అటెండెన్స్ చెల్లదని వారు తేల్చి చెప్పారు.
నేటి సెషన్ టెక్నికల్ గా లెక్కలోకి రాదని బాంబు పేల్చారు. అంతేకాదు మంగళవారం నుంచి స్పీకర్ అధ్యక్షతన జరగబోయే సమావేశాలు తొలిరోజు సమావేశాలు అవుతాయని, ఆ రోజు నుండి అటెండెన్స్ పరిగణలోకి తీసుకుంటామని అధికారులు తేల్చి చెప్పారు. ఈరోజు జరిగిన సెషన్ కస్టమరీ సెషన్ మాత్రమేనని వారు వెల్లడించారు. దీంతో, అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు ఆపసోపాలు పడి పది నిమిషాల పాటు సభకు వచ్చిన జగన్ కు షాక్ తగిలినట్లయింది.
అంతేకాదు, వాకౌట్ చేసిన తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడిన జగన్…ఇకపై ఈ బడ్జెట్ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయించారు. జగన్ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారులు బాంబు పేల్చడంతో ఇప్పుడు జగన్ దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు. మరి, సస్పెన్షన్ వేటు తప్పించుకునేందుకు జగన్ మరో సాకుతో మరో రోజు అసెంబ్లీకి హాజరవుతారా లేదా అన్న వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది.