తెలంగాణ ముఖ్యమంత్రిపై ఏపీ ఎన్నికల సమయంలో విమర్శలు చేసిన సీఎం జగన్ .. ఇప్పుడు అదే రేవంత్‌ను బ్రతిమాలుకునే పనిలో పడ్డారు. ఎన్నికల వేళ.. చంద్రబాబుకు రేవంత్ అనుకూల వ్యక్తి అని.. తనపై యుద్ధం చేయడానికి తన సోదరిని ప్రోత్సహించి పంపించారని సీఎం జగన్ విమర్శించిన విషయం తెలిసిందే. ఇప్పుడు.. అదే రేవంత్‌కు సీఎం జగన్.. లేఖ రాశారు. “బాబ్బాబు.. కొంచెం వెయిట్ చేయండి“ అన్న విధంగా తెలంగాణ సీఎంను రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
విషయం ఏంటి?
రాష్ట్ర విభజన తర్వాత.. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. అయితే.. దీనికి విధించిన పదేళ్ల కాలప రిమితి కూడా.. జూన్ 2న తేదీ(రెండు రోజుల్లో)న తీరిపోతుంది. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీకి కేటాయించిన భవనాలను అదే రోజు స్వాధీనం చేసుకోవాలని రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. దీంతో వారంతా స్వాధీనం చేసుకునేందుకు రెడీ అయ్యాయి. ఇది ఏపీలో ఉన్న జగన్‌కు ఇబ్బందిగా మారింది.
రేపు జగన్ పార్టీ ఓడిపోయినా.. గెలిచినా.. తెలంగాణ సర్కారు ఏపీ భవనాలను స్వాధీనం చేసుకుంటే చూస్తూ కూర్చున్నారనే విమర్శలు వస్తాయి. దీంతో ఆయా భవనాల స్వాధీనం విషయంలో కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరుతూ.. తెలంగాణ సీఎం రేవంత్‌కు లేఖ రాశారు. కొంత వెయిట్ చేయాలని.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చే వరకు.. నిరీక్షించాలని కోరారు. అయితే.. దీనిపై రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి.
ఏయే భవనాలు ?
+ రాజ్‌భవన్ రోడ్లో ఉన్న లేక్‌వ్యూ అతిథిగృహం
+ లక్డీకాపుల్‌లో పోలీసు విభాగానికి చెందిన సీఐడీ భవనం
+ ఆదర్శనగర్‌లోని హెర్మిటేజ్ కాంప్లెక్స్
+ హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణా కమిషన్ ఆఫీస్