ఏపీ సీఎం జగన్‌కు ప్రతిపక్ష టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ లేఖను సంధించారు. ఇలా చేయడం ధర్మమా? అంటూ నిలదీశారు. గిరిజనులు, వారి సమస్యలను ప్రస్తావించిన లోకేష్ .. సీఎం జగన్ అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. “ముఖ్యమంత్రి గారూ! మీకు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా? అడ్డగోలు నిబంధనలతో ఆదివాసీలకు సంక్షేమపథకాలు అందకుండా దూరం చేయడం మీకు న్యాయమా? తలకుమించిన అప్పులతో సంక్షేమపథకాలకు కోత వేయాలనే ఆలోచనతో కనీస అధ్యయనం లేకుండా మీరు తెచ్చిన నిబంధనలు వేలాదిమంది గిరిజనుల జీవనాధారమైన పింఛను, రేషన్‌ని దూరం చేస్తున్నాయి“ అని లేఖలో లోకేష్ వాపోయారు.
దూరం చేయడం తగదు!
“నిరక్షరాస్యులైన ఆ గిరిజనులు తమకి రేషన్ బియ్యం ఎందుకివ్వడంలేదో, పింఛను ఎందుకు ఆపేశారో తెలియక…కొండలపై నుంచి దిగి రాలేక…ఆకలితో, ఆవేదనతో కుంగిపోతున్నారు. గిరిజనుల కన్నీటికష్టాలపై పత్రికలలో కథనాలు వచ్చినా మీరు సరిదిద్దే చర్యలు తీసుకోకపోవడం ఆదివాసీల పట్ల మీ చిన్నచూపుని ఎత్తిచూపుతోంది. సంక్షేమపథకాలు కోతవేయాలనే హిడెన్ అజెండాతో పది ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, వాహనం ఉంటే వారిని సంక్షేమపథకాలకు అనర్హులని మీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు ఆదివాసీలపాలిట శాపంగా మారాయి. ఈ నిబంధనలే ఆదివాసీలని సంక్షేమపథకాలకి దూరం చేస్తున్నాయి“ అని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
అది ప్రభుత్వ బాధ్యతే!
భూమి ఉందని మీరు పింఛను, రేషన్ పీకేయడం అన్యాయం కాదా? ఇటువంటి పరిస్థితుల్లో పది ఎకరాల నిబంధనతో గిరిజనుల నోటికాడ కూడు లాక్కోవడం, సంక్షేమపథకాలకు దూరం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం పునఃపరిశీలించాలి. టిడిపి ప్రభుత్వ హయాంలో ఆదివాసీలందరికీ ఎటువంటి కొర్రీలు వేయకుండా సంక్షేమపథకాలు అందించాం. మీరు అధికారంలోకి వచ్చాక 5 ఎకరాలు భూమి వున్న గిరిజనులని పథకాలకి అనర్హులుగా ప్రకటిస్తున్నారు. కొంతమంది ఆదివాసీలకు ఎటువంటి భూమి లేకపోయినా, రికార్డుల్లో 10 ఎకరాలు మించి ఉన్నట్టు చూపిస్తూ… సంక్షేమపథకాలు నిలిపేస్తున్నారు. రికార్డుల్లో మీరు చూపించిన భూమి ఆయా ఆదివాసీలకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అని లోకేష్ స్పష్టం చేశారు.
పింఛన్ ఆపేస్తారా?
కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగం చేసినా ఆ కుటుంబపెద్దల ఆర్థికస్థితి కూడా చూడకుండా పెన్షన్లు ఆపేస్తున్నారు. ఉద్యోగం వచ్చిన వ్యక్తి తల్లిదండ్రుల్ని కొండలపైనే వదిలి మైదానప్రాంతాలకి వెళ్లిపోతున్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అనే కారణంతో సంక్షేమపథకాలు మీరు ఆపేస్తున్నారు. కొండలపై ఆ నిరుపేద వృద్ధులు ఎలా బతకాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. టిడిపి ప్రభుత్వ హయాంలో గిరిజనులకు 200 యూనిట్లు లోపు ఉచిత విద్యుత్ అందించాం. ఇప్పుడు ఉచితవిద్యుత్ ఎత్తేసి… 300 యూనిట్లు విద్యుత్ వాడకం దాటినవాళ్ల పింఛన్లు, రేషన్‌కార్డులు తీసేయడం గిరిజనులని మోసం చేయడమే. అని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ హయాంలో..
ఎన్టీఆర్ సీఎంగా వున్నప్పుడు గిరిపుత్రులకి పక్కాఇళ్లు కట్టించి ఇస్తే.. ఇప్పుడు వన్‌టైమ్ సెటిల్మెంట్ పేరుతో పదివేలు కట్టాలనడం దుర్మార్గమైన చర్య. ఓటీఎస్ కట్టని ఆదివాసీల సంక్షేమపథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు. సీఎంగా మీరేమో స్వచ్ఛందం అంటున్నారు, అధికారులేమో మాకు టార్గెట్ ఇచ్చారని, కట్టకపోతే..పింఛన్లు, రేషన్ కట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఓటీఎస్ స్వచ్ఛందం అని మీరు చెప్పేది అబద్ధమా? అధికారుల బెదిరింపులు నిజమా? అనేది స్పష్టతనివ్వాలి. భూమి, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం, 300 యూనిట్లు దాటిన కరెంటు బిల్లు, కుటుంబంలో వారికి ద్విచక్రవాహనాలున్నా, సచివాలయాల్లో వివరాలు అప్డేట్ చేసుకోని కారణంగా అమ్మఒడి, రేషన్, పింఛన్లు, సంక్షేమపథకాలను గిరిజనులకు అందకుండా చేశారు. ఇది దారుణం కాదా? అని ప్రశ్నించారు.