ఇప్పటివరకు రాష్ట్రంలో ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన భూములను, ఆస్తులను వైసీపీ నేతలు ఆక్రమించారనే వాదన సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆయా కేసులపై హైకోర్టులో విచారణ సాగుతోంది. ఇక, రాజధాని అమరావతిలో చంద్రబాబు ఎస్సీలకు అన్యాయం చేశారని… జీవో 41తో ఎస్సీల పొట్టగొట్టారని.. లేనిపోని ఆరోపణలతో హైకోర్టుకెక్కారు వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే! అయితే… ఇదంతా ఎస్సీల విషయంలో మొసలి కన్నీరేనని ఎస్సీ సామాజిక వర్గాలే ఆరోపించాయి. తాము ఇష్టపడి.. భూములు ఇచ్చామని ఆ వర్గాలు పేర్కొన్నాయి. సరే! ఎస్సీల విషయంలో ఇంతగా కన్నీరు పెట్టుకుని, వారికి ఏదో అన్యాయం జరిగిపోయిందని తెగ బాధపడ్డ వైసీపీ సర్కారు.. మరి అదే ఎస్సీ వర్గాలకు నిజంగానే న్యాయం చేస్తోందా?
అంటే.. లేదనే అంటోంది సాక్షాత్తూ.. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. ఎస్సీ సామాజిక వర్గాల కోసం.. కేటాయించిన భూములు కాదు.. ఏకంగా భవనాలను కూడా ప్రభుత్వం తన సొంతానికి వాడుకోవడాన్ని హైకోర్టు తీవ్రస్థాయిలో దుయ్యబట్టింది. ఇలా చేస్తారా? అంటూ.. ప్రశ్నలు సంధించింది. విషయంలోకి వెళ్తే.. నెల్లూరు జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కబాడీపాలెంలో గత చంద్రబాబు ప్రభుత్వం ఎస్సీ జనాభా శుభకార్యాలు నిర్వహించుకునేందుకు, వారికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఓ కమ్యూనిటీ హాల్‌ను నిర్మించింది. తద్వారా.. ఎస్సీ సామాజిక వర్గం తమ పిల్లల వివాహాలు చేసుకునేందుకు, సమావేశాలు నిర్వహించుకునేందుకు ఈ కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగ పడుతోంది.
అయితే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వ భవనాలను వినియోగించుకుంటున్నారు. అయితే.. కబాడీపాలెంలో మాత్రం ఎస్సీ సామాజిక వర్గం కోసం చంద్రబాబు సర్కారు నిర్మించిన ఎస్సీ కమ్యూనిటీ హాల్‌ను తీసేసుకుని వాడుతున్నారు. దీంతో ఎస్సీలు ఏ కార్యక్రమం నిర్వహించుకునేందుకు.. అవకాశం లేకుండాపోయింది. ఈ పరిణామంపై స్థానిక మంత్రి అనిల్ కుమార్‌కు కూడా ఎస్సీ వర్గాలు మొరపెట్టుకున్నాయి. కానీ, ఆయన కూడా పట్టించుకోలేదు.
దీంతో ఎస్సీ వర్గాలు సహా నెల్లూరుకు చెందిన మేడూరి ప్రశాంత్ కుమార్.. హైకోర్టును ఆశ్రయించి.. కేసు వేశారు. ప్రభుత్వాన్ని ప్రతివాదిగా చేర్చారు. దీనిపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రభుత్వం చర్యలపై తీవ్రస్థాయిలో మండిపడింది. “ఎస్సీ సామాజిక వర్గంకోసం కేటాయించిన భవనాన్ని ఆక్రమించుకున్నారని అనిపిస్తోంది.. ఇది మంచి పద్ధతి కాదు.. తక్షణమే భవనాన్ని.. ఖాళీ చేసి.. ఎస్సీలకు అప్పగించాలి“ అని సంచలన తీర్పు వెలువరించింది.
అంతేకాదు.. ఎస్సీ వర్గానికి కేటాయించిన భవనాన్ని ప్రభుత్వ కార్యాలయంగా ఎలా వాడుతారని నిలదీసింది. వెంటనే వారి భవనాన్ని వారికి అప్పగించాలని తీర్పు వెలువరించింది. దీంతో దిగివచ్చిన సర్కారు తరఫున న్యాయవాది… కొంత గడువు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ప్రభుత్వ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. నెల రోజుల గడువు ఇచ్చింది. మొత్తానికి ఈ పరిణామంతో ఎస్సీలపై జగన్ ప్రభుత్వానికి ఎంత ప్రేమ ఉందో అర్ధమవుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు.