ఏపీలోని జగన్ సర్కారు దివాలా తీసిందా? సర్కారీ ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయిందా? ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. ఈ నెల అప్పుడే పదో తేదీ వచ్చేసింది. అయినా.. రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న వేతన జీవులకు ఇప్పటి వరకు జీతాలు పడలే దు. పోనీ.. ఎప్పుడు పడతాయో.. అయినా తెలియని పరిస్థితి. నిజానికి రేపు మాపు అంటూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వేతనాలు వేయకపోవడం షరా మామూలుగా మారిపోయింది. రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కొలువు దీరినప్పటి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు నరకం చూపిస్తున్నారనేది నిర్వివాదాంశం.
వాస్తవానికి ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు ఇవ్వడం అనేది.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా చేసిన పని. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు.. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండేది ఉద్యోగులే. ప్రజలకు సేవ చేసే వారికి.. వేతనాలు సమయానికి ఇవ్వడం అనేది మినిమమ్ కర్టసీ. గతంలో చంద్రబాబు హయాంలో కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు ఖజానా కష్టాలు.. ఆర్థిక లోటు వంటివి వెంటాడినా.. ఠంచునుగా ఉద్యోగులకు మాత్రం వేతనాలు చెల్లించారు. అదేసమయంలో ఉద్యోగుల ప్రధాన డిమాండ్ అయిన 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చి.. వారికి ఇబ్బందులు రాకుండా చూసుకున్నారు. రాష్ట్రం ఎన్నికష్టాల్లో ఉన్నా.. ఉద్యోగులకు ఒక్కరోజు కూడా వేతనాలు ఆలస్యం కాలేదు.
కానీ, జగన్ హయాంలో మాత్రం.. ఏపీలో ఉద్యోగులు వేతనాలు ఎప్పుడు ఇస్తారో తెలియక అల్లాడిపోతున్నారు. ఇది ఈ రోజు వచ్చిన సమస్య కాదు.. గడిచిన ఏడాదిన్నరగా ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలను ఎప్పుడు గుర్తుకు వస్తే.. అప్పుడు అన్నట్టుగా ఇస్తుండడం గమనార్హం. రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మరి దీనికి కారణం ఏంటి? అంటే.. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో వచ్చే కోట్లాది రూపాయల పన్ను వసూళ్లను వచ్చిన వాటిని వచ్చినట్టు.. సంక్షేమ పథకాలకు పంపిణీ చేసేస్తున్నారు. దీంతో రాష్ట్ర ఖజానా ఎప్పటికప్పుడు నోరు తెచుకుని ఎదురు చూస్తూనే ఉంది.
ఈ ప్రభావం.. వేతన జీవులపై ప్రతి నెలా పడుతూనే ఉంది. గడిచిన నాలుగు మాసాలుగా.. విడతల వారీగా కూడా వేతనాలు ఇస్తుండడం రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని కళ్లకు కడుతోందని అంటున్నారు పరిశీలకులు. వేతనాల కోసం.. అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని.. అధికార వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. అయితే.. ఈ దఫా అప్పులు కూడా పుట్టని పరిస్థితినెలకొంది. భారీ స్థాయిలో అధిక వడ్డీలు చెల్లించేందుకు రెడీ అయినా.. అప్పులు పుట్టని పరిస్థితి ఏర్పడింది. ఏతావాతా.. జగనన్న వచ్చిన రెండేళ్లలోనే రాష్ట్రం దివాలా తీసే పరిస్థితికి చేరుకుందనే కామెంట్లు సర్వత్రా వినిపిస్తుండడం గమనార్హం.