జనం నవ్విపోతారన్న జంకు సీఎం జగన్ కు ఏ మాత్రం లేదు. తన ఎదురుగా ఉన్నవారికి అన్ని నిజాలూ తెలుసన్న గ్రహింపు లేనేలేదు. అలవోకగా పచ్చి అబద్ధాలు ఆడేస్తున్నారు. తన పాలనా రాజధాని విశాఖను ఫినిష్ చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆయన మాటలు వింటే ఇట్టే అర్థమవుతుంది. జనం చెవిలో ఎల్లకాలం పూలు పెడుతూనే ఉండొచ్చని… ఉత్తరాంధ్ర ప్రజలను మరింత ఈజీగా మభ్యపెట్టవచ్చని ఆయన బలంగా నమ్ముతున్నారు. రాజధాని అమరావతిపైనే కాదు… తాజాగా ‘విశాఖ’ చుట్టూ కట్టుకథలు అల్లుతున్నారు. ఎన్నికల ముంగిట ‘విజన విశాఖ’ అంటూ కనికట్టు చేస్తున్నారు. ‘ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఫినిషింగ్ టచ్ ఇస్తే చాలు’ అన్నారు.
అంటే భూములన్నీ మింగేయడమా? భూములు కొల్లగొట్టి, రుషికొండకు గుండు కొట్టి, పరిశ్రమలను వెళ్లగొట్టి, పెట్టుబడిదారులను బెదరగొట్టిన ఆయన ఎప్పుడో విశాఖను ‘ఫినిష్’ చేశారు. ఇప్పుడు ఎన్నికల ముందు మళ్లీ ‘టచ్’ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న విశాఖపట్నం రాడిసన్ బ్లూ హోటల్లో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలతో సమానంగా పోటీ పడాలంటే… రాజధాని మార్పు అనివార్యం అని జగన్ పేర్కొన్నారు. అదే సమయంలో రాజధానిగా అమరావతిని తాను వ్యతిరేకించడం లేదని, అది శాసన రాజధానిగా ఉంటుందని పాతపాటే పాడారు. ‘‘అక్కడ 50 వేల ఎకరాలను అభివృద్ధి చేయాలంటే ఏడాదికి రూ.5 వేల కోట్లు కావాలి.
అంత డబ్బు పెట్టలేం. పైగా అక్కడ చుట్టుపక్కల భూములన్నీ ప్రతిపక్ష నాయకుల చేతుల్లో ఉన్నాయి. బినామీలు ఉన్నారు’’ అని పచ్చి అసత్యం పలికారు. విశాఖలో ప్రభుత్వ భూములు కనిపిస్తే పరిశ్రమల పేరుతో తన వారికి కట్టబెడుతున్నారు. పులివెందుల ముఠా అక్కడే తిష్ఠ వేసి ప్రైవేటు భూములు కబ్జా చేస్తోంది. విశాఖ జనం నెత్తీనోరూ బాదుకుంటున్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ అమరావతితో పోలిక పెడుతున్నారు. అమరావతిలో భూముల స్కామ్, ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ విపక్షంలో ఉన్నప్పుడే కాదు.. అధికారంలోకి వచ్చాక కూడా రచ్చ చేస్తూనే ఉన్నారు. కానీ… ‘ఇన్సైడర్’ లేనేలేదని హైకోర్టు తేల్చిచెప్పింది.
అదే సమయంలో… విశాఖలో వైసీపీ నేతలు భారీగా భూములు కొట్టేసే పని మొదలుపెట్టారు. వారికి కొమ్ముకాస్తున్న ఐఏఎస్ అధికారులు కూడా వందల ఎకరాలను పోగేసుకున్నారు. బలవంతంగా లాక్కున్నారు. విశాఖ-భోగాపురం బీచ్ కారిడార్ అంతా ఇదే బాగోతం. ఈ భూముల రేట్లు పెంచుకోవడానికే… విశాఖను ‘పరిపాలనా రాజధాని’గా ప్రకటించారనే అనుమానాలున్నాయి.
ఏకంగా ప్రమాణస్వీకారం చేస్తారట!
సీఎంగా విశాఖకు వచ్చి ఉంటే విశాఖ అభివృద్ధి చెందుతుందట.. ఇది ప్రతిపక్షాలకు ఇష్టం లేదట. ‘ఏదేమైనా సరే… ఎన్నికల తర్వాత విశాఖలోనే ఉంటాను. ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తా’ అని ప్రకటించారు! విశాఖలో ఉండకుండా ఎవరు అడ్డుకున్నారు.. ఇదిగో ఫలానా రోజు నుంచి ఇక్కడే కాపురం పెట్టబోతున్నానని ముహూర్తాలు పెట్టడం.. కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని హైకోర్టు, సుప్రీంకోర్టు తప్పుబడితే పరువుపోతుందని జంకడం మూడేళ్లుగా చూస్తున్నదే. ఇప్పుడు ‘ఎన్నికల తర్వాత’ కాపురం పెడతానని అంటున్నారు.
రకరకాల తప్పుడు ఉద్దేశాలు, అజెండాతో అమరావతిని అటకెక్కించి… విశాఖను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చారు. అంతేతప్ప విశాఖపై ఆయనకు ఎలాంటి ప్రేమా లేదు. పరిపాలనా రాజధాని కావాలని ఈ ప్రాంత ప్రజలు ఏనాడూ కోరుకోలేదు. నగరం ప్రశాంతంగా ఉండాలనే కోరుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే విశాఖలో భూములపై పడి, ఇళ్లకు వెళ్లి తుపాకులతో బెదిరించిన ముఠాలను చూశాక… ‘మాకు రాజధాని వద్దు బాబోయ్’ అంటూ అంతా వ్యతిరేకిస్తున్నారు. సీఎంగా ఒక్క పూట విశాఖ పర్యటనకు వస్తేనే సామాన్యులను నానారకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక జగన్ ఇక్కడే ఉంటే ఏమైనా ఉందా… అని విశాఖ వాసులు వణికిపోతున్నారు.
పైగా ‘ఫినిషింగ్ టచ్’ ఎన్నికల ముందే గుర్తుకొచ్చిందా? విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి గాజువాక నుంచి మధురవాడ వరకు 12 ఫ్లైఓవర్లు నిర్మిస్తామని వైసీపీ నాయకులు ఐదేళ్లుగా చెబుతూనే ఉన్నారు. అందులో ఒక్కటి కూడా నిర్మించలేదు. కనీసం డీపీఆర్ కూడా తయారు కాలేదు. కానీ విశాఖలో ఐకానిక్ సెక్రటేరియట్ కడతారట! అమరావతిలో పదివేల కోట్ల రూపాయలకు పైగా విలువైన పనులు జరిగినా ‘అన్నీ గ్రాఫిక్స్. ఒక్క ఇటుక కూడా పడలేదు. అది శ్మశానం. ఎడారి’ అని ఇదే జగన్ అబద్ధాలు ప్రచారం చేశారు. సచివాలయంతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి చేపట్టిన ‘ఐకానిక్ టవర్స్’ నిర్మాణ పనులు అప్పటికే మొదలయ్యాయి. వాటితోపాటు మొత్తం రాజధాని పనులను జగన్ ఆపివేయించారు.
ఇప్పుడు… ప్రపంచం, దేశమంతా గర్వంగా విశాఖ వైపు చూసేలా ఐకానిక్ నిర్మాణాలు చేపడతామని కబుర్లు చెబుతున్నారు. ఐకానిక్ సెక్రటేరియట్, ఐకానిక్ కన్వెన్షన్ సెంటర్, ఐకానిక్ స్టేడియం నిర్మిస్తారట! ‘ఫినిషింగ్ టచ్’లు చాలంటున్న ఆయన… ఇన్ని ‘ఐకానిక్’ నిర్మాణాలకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు?
ఏదీ ఐటీ వర్సిటీ?
రాష్ట్రంలో యువతకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ బోధించేందుకు చక్కటి విద్యా సంస్థ ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించారు. ఇది మూడేళ్లనాటి మాట. ఐటీకి సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా ఓ యూనివర్సిటీ పెడతామని ఏపీఐఐసీతో ప్రకటన కూడా చేయించారు. రుషికొండ ఐటీ హిల్స్‌లో పెడతామన్నారు. ఆ దిశగా ఎటువంటి ప్రయత్నాలూ చేయలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం కట్టకుండా జగనే అడ్డుకున్నారు. స్థానిక రైతులు, నేతలతో కేసులు వేయించారు. వాటన్నిటినీ అధిగమించి చంద్రబాబు హయంలోనే ఈ విమానాశ్రయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జగన్‌కు నిజంగా సంకల్పం ఉంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఈ పాటికే నిర్మాణం పూర్తయ్యేది.
కానీ… ఇక్కడ కూడా స్వప్రయోజనాలు చూసుకున్నారు. విమానాశ్రయ నిర్మాణానికి కేటాయించిన భూముల్లో అనువుగా ఉన్న 500 ఎకరాలను భవిష్యత అవసరాలు పేరుతో పక్కన పెట్టుకున్నారు. ఆ పరిసరాల్లో మరికొన్ని భూములు వైసీపీ నేతలు కొనుక్కున్నారు. అవన్నీ పూర్తయ్యాక నాలుగేళ్ల పాలన తర్వాత మరోసారి శంకుస్థాపన చేశారు.
స్టీల్ ప్లాంటు భూముల వేలం
విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణను అడ్డుకోకపోగా.. నాన్‌కోర్ ఆస్తుల వేలానికి జగన్ సర్కారు దన్నుగా నిలబడింది. స్టీల్‌ప్లాంటుకు హెచ్‌బీ కాలనీ, ఆటోనగర్, పెదగంట్యాడల్లో ఉద్యోగుల క్వార్టర్లు ఉన్నాయి. అవి బాగా పాతబడిపోవడంతో ప్రస్తుతం వాటిలో ఎవరూ ఉండటం లేదు. ఆర్థిక అవసరాల రీత్యా వాటిని విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించింది. దీనికోసం నేషనల్ బిల్డింగ్ కనస్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్బీసీసీ) ద్వారా వేలం వేయడానికి గతంలో ప్రకటన ఇచ్చారు. హెచ్‌బీ కాలనీలో 14 బ్లాక్‌లు, 111 ప్లాట్లు, ఆటోనగర్‌లో 4 బ్లాక్‌లు, పెదగంట్యాడలో ఒక బ్లాక్… మొత్తం 130 స్థలాలను వేలానికి పెట్టారు.
వీటి మొత్తం విస్తీర్ణం 67,307 చ.గజాలు. ప్రాంతాన్ని బట్టి అప్సెట్ ధర నిర్ణయించారు. గత నెల 14, 15 తేదీల్లో నిర్వహించిన ఈ-వేలంలో 72 స్థలాలు అమ్ముడయ్యాయి. వాటిలో 9 బ్లాక్‌లు, 63 ప్లాట్లు ఉన్నాయి. వాటి మొత్తం విస్తీర్ణం 29,268 చ.గజాలు. వీటిద్వారా రూ.209.5 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. అయితే వేలంలో కొన్నింటికి అధిక ధర లభించి రూ.242.9 కోట్ల ఆదాయం సమకూరింది. ఆశించిన దానికంటే రూ.33.4 కోట్లు అదనంగా వచ్చింది. జగన్, విజయసాయిరెడ్డి, అరబిందో శరతచంద్రారెడ్డిల బినామీలు వీటిని కొనుగోలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పదేళ్లలో 1.05 లక్షల కోట్లు ఖర్చు పెడతారట!
మాటలు తప్ప చేతలు ఎరుగని… కూల్చడమేతప్ప కట్టడం తెలియని ముఖ్యమంత్రి జగన్.. 1.05 లక్షల కోట్లతో విజన్ విశాఖ’ ప్రకటించారు. కానీ వాటిలో 90 శాతం ఎప్పుడో మొదలైన, పనులు జరుగుతున్న, ఎప్పుడో ప్రతిపాదించిన ప్రాజెక్టులే! అందులోనూ అత్యధికం కేంద్ర ప్రభుత్వానికి చెందినవి! విశాఖపట్నం-చెన్నై ఇండస్ర్టియల్ కారిడార్ పనులు గత దశాబ్దకాలంగా జరుగుతున్నాయి. వాటిని కూడా సీఎం తన ఖాతాలో వేసుకున్నారు. ఎప్పుడో తెలుగుదేశం హయాంలోనే భూసేకరణ జరిగి, శంకుస్థాపన చేసుకున్న భోగాపురం విమానాశ్రయాన్ని కూడా ఇంకా ‘విజన్’ కిందే చేర్చారు.
విశాఖపట్నం పోర్టు సబ్బవరం నుంచి షీలానగర్ వరకు, షీలానగర్ నుంచి పోర్టు వరకు సాగరమాల కింద కేంద్రం రూ.1550 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులకూ విజన్ రంగు పులిమారు. ఎన్టీపీసీ సంస్థ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్‌కు రూ.20,225 కోట్లు వెచ్చిస్తుండగా, అది కూడా తన పనితనమే అని జగన్ బిల్డప్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన హెచ్‌పీసీఎల్ విస్తరణ, రాంబిల్లి ప్రాజెక్టులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇవన్నీ ఇప్పటికే ప్రారంభమై పూర్తయ్యే దశలో ఉన్నాయి. పేదలకు ఇచ్చిన జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్లు, మధ్య తరగతి ప్రజలకు స్మార్ట్ టౌన్‌షిప్స్… అన్నీ విజన్‌లో చూపించారు.
వాటి విలువ రూ.4,039 కోట్లుగా పేర్కొన్నారు. విశాఖపట్నం పోర్టు వద్ద లీజుకు తీసుకున్న భూమిలో ఏర్పాటవుతున్న ఇనార్బిట్ మాల్‌ను కూడా తమ ఖాతాలో వేసుకొని… దానికి రూ.750 కోట్లు వ్యయంగా చూపించారు. గ్లోబల్ కన్వెన్షన్ సెంటర్ పేరుతో రూ.500 కోట్లు చూపించారు. అది ఎక్కడో ఎవరికీ తెలియదు.
బెదిరించి తీసుకొచ్చారు!
విశాఖకు ఏదో చేశామని, చేస్తామని ఎన్నికల ముందు చెప్పుకోవడానికే ‘విజన్ విశాఖ’ సదస్సు ఏర్పాటు చేశారు. దీనికి పారిశ్రామిక వేత్తలను తీసుకొచ్చే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి అప్పగించారు. దీంతో వారు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తప్పకుండా రావాలని సూచించారు. కలెక్టర్ కార్యాలయం నుంచీ ఫోన్లు వెళ్లాయి. ఏపీఐఐసీకి చెందిన అధికారులు కూడా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టారు. అయితే చాలామంది తాము రావడం లేదని చెప్పగా… ‘ఎందుకు? ఏమిటి?’ అని ప్రశ్నించారు. కొందరు ఆరోగ్యం బాగా లేదని, కొందరు ఊళ్లో లేమని చెప్పారు. మరికొందరు… ‘కారణం ఎందుకు చెప్పాలి?’ అని ఎదురు ప్రశ్నించారు.
దీంతో వైసీపీ నేతలు రంగప్రవేశం చేసి వారిని బెదిరించారు. దీంతో అతికొద్దిమంది పారిశ్రామిక వేత్తలు మాత్రమే స్వయంగా సదస్సుకు హాజరయ్యారు. చాలామంది తమ కార్యాలయ సిబ్బందిని, సంస్థ పీఆర్వోలను పంపించారు. పారిశ్రామికవేత్తల నుంచి తగిన స్పందన రాకపోవడంతో అధికారులు హడలెత్తిపోయారు. ‘సూట్లు వేసుకుని సీఎం ప్రోగ్రామ్‌కు వెళ్లండి’ అని ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్లను ఆదేశించారు. దాంతో వారు పెద్దసంఖ్యలో సూటూ బూటు వేసుకుని ర్యాడిసన్ హోటల్‌కు విచ్చేశారు. కేటరింగ్లు నడిపేవారిని, పర్యాటకులకు కార్లు అద్దెకు ఇచ్చేవారిని, రియల్ ఎస్టేట్‌లో ప్లాట్లు విక్రయించే వారిని కూడా ‘పారిశ్రామికవేత్తలు’గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు.
అయినా హాలు నిండకపోవడంతో… వార్డు సచివాలయ సిబ్బందికి కబురు పంపారు. మధురవాడ సచివాలయ సిబ్బంది హోటల్ బయటే ఉండి… పాస్‌లు అందించి లోపలికి పంపించారు. ఒక స్వీట్ దుకాణం యజమానికి, మరో ఫంక్షన్ హాల్ యజమానికి పాస్‌లు జారీచేసి సదస్సుకు అనుమతించడం కనిపించింది. వారిని గుర్తుపట్టిన కొందరు ‘వారు పారిశ్రామికవేత్తలా?’ అని ఆశ్చర్యపోయారు.