వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారంటూ ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా కోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. దస్తగిరిని బలవంతంగా అప్రూవర్ గా మార్చారని, ఆ స్టేట్మెంట్ ను మాత్రమే పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారని అవినాష్ తరపు లాయర్లు వాదించారు.
వివేకా రెండో పెళ్లి కోణాన్ని పట్టించుకోవడంలేదని అవినాష్ రెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే, ఈ వ్యవహారంలో వివేకా కుమార్తె సునీత రెడ్డి కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డిని సిబిఐ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతుందని సిబిఐ తరఫున లాయర్లు జవాబిచ్చారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ విచారణ తర్వాత అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే ముందస్తు బెయిల్ కోరుతూ తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రేపు ఉదయం 10:30 గంటలకు విచారణకు రావాలని సిబిఐ అధికారులు చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా అమరావతిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో వైసీపీ ముఖ్య నేతలతో సీఎం జగన్ అత్యవసర భేటీ నిర్వహించారు. అవినాష్ అరెస్టు అంటూ ముమ్మరంగా జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో జగన్ ఈ భేటీ నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలతోపాటు ఈరోజు ఉదయం పులివెందులలో అవినాష్ రెడ్డిని కలిసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలతో జగన్ అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతపురం పర్యటనతో పాటు మిగతా అధికారిక సమీక్షలను జగన్ క్యాన్సిల్ చేసుకుని మరీ ఈ భేటీని నిర్వహించడం విశేషం.