`బట్టలు ఊడదీసి నిలబెడతాం!` అన్న ఒకే ఒక్క డైలాగు.. ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేయడం.. కిడ్నాప్, కుట్ర కేసులో ఆయనకు 14 రోజలు రిమాండ్ పడడం తెలిసిందే. దీంతో వంశీని విజయవాడ సబ్ జైల్లో ఉంచారు. అయితే.. వైసీపీ అధినేత ఆయనను మంగళవారం పరామర్శించారు. ఈ సందర్భంగా అటు రాజకీయ ప్రత్యర్థులపైనా.. ఇటు పోలీసులపైనా జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వంశీపై అక్రమంగా కేసు పెట్టారన్న ఆయన.. తాము వచ్చాక.. సప్తసముద్రాల ఆవల ఉన్నా.. తీసుకువచ్చి బట్టలూడదీసి నిలబెడతాం! అని చెప్పారు.
అయితే.. నిన్న మొన్నటి వరకు కూడా వంశీ కేసుపై పెద్ద ఎత్తున చర్చ జరిగినా.. జగన్ చేసిన బట్టలూడదీసి కొడతాం వ్యాఖ్య తర్వాత.. ఆ చర్చ పోయి.. ఇప్పుడు జగన్ కామెంట్లపైనే అసలు సిసలు చర్చప్రారంభమైంది. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న జగన్.. చిన్న దానికీ.. చితక దానికీ ఆవేశ పడుతుండడం.. తీవ్ర వ్యాఖ్యలు చేయడం వంటివి సమంజసం కాదని మేధావులు అంటున్నారు. మరోవైపు.. సోషల్ మీడియాలో జగన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగానే కౌంటర్లు పడుతున్నాయి. ఎవరి బట్టలు ఎవరు ఊడదీశారో తెలుసుకదా? అంటూ.. కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
గత ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైనా.. జగన్కు ఇంకా జ్ఞానం రాలేదని అనేవారే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఇక, విషయాన్ని విషయంగా చూడకుండా.. తన ఆవేశాన్ని కలగలిపితే.. ఇలానే ఉంటుందని మరికొందరు వ్యాఖ్యానించారు. ప్రజా స్వామ్యంలో బట్టలూడదీసుకునే రాజకీయాలు చేసే జగన్ ఇక, ఎప్పటికీ అధికారంలోకి రాలేడని ఎక్కువ మంది నెటిజన్లు వ్యాఖ్యానించారు. వంశీ కేసు విషయంలో వాస్తవాలను ప్రజల ముందు ఉంచి.. వాటిని వివరించి ఉంటే.. ప్రజలే నిర్ణయించుకునే వారని.. జగన్ ఇలా నోటి దురుసు వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని మరికొందరు వ్యాఖ్యానించారు.
కట్ చేస్తే.. సొంత పార్టీవైసీపీలోనూ.. జగన్ చేసిన వ్యాఖ్యలపై పెదవి విరుపులు కనిపించాయి. చాలా మంది నాయకులు ఈ వ్యాఖ్యలను హర్షించడం లేదు. అందుకే.. ఎవరికి వారు మౌనంగా ఉన్నారు. సాధారణంగా అధినేత కామెంట్లు చేసిన తర్వాత.. వాటికి కొనసాగింపుగా ఇతర నాయకులు స్పందిస్తారు. కానీ, తాజా వ్యాఖ్యల తర్వాత.. ఎవరూ స్పందించలేదు. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లోనూ జగన్కు ప్రజలే బట్టలూడదీస్తారని.. అప్పుడు జగన్ రెడ్డి కాస్తా.. జీరో రెడ్డి అవుతారని టీడీపీ ఎంపీలు ఎద్దేవా చేయడం గమనార్హం. ఇవన్నీ ఇలా ఉంటే.. జగన్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలపై న్యాయ పోరాటం చేస్తామని.. అక్కడే తేల్చుకుంటామని చెప్పడం గమనార్హం.