ఏపీలో చెత్త పన్ను మొదలు విద్యుత్ చార్జీల వరకు జగన్ వీర బాదుడుకు జనం బెంబేలెత్తుతున్న సంగతి తెలిసిందే. జనం నడ్డి విరిచేలా జగన్ నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ చార్జీలను పెంచుకుంటూ పోతున్నారని విపక్ష నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఇక, ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ దీనికి అదనమని, జగన్ విధానాలతో ప్రతి కుటుంబంపై ఏడాదికి హీనపక్షం రూ.1 లక్ష భారం పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు గణాంకాలతో సహా గతంలో విశ్లేషించారు.
జగన్ బాదుడేబాదుడుతో ప్రజలు విలవిలలాడిపోతున్నారని, జగన్ చేసే అప్పుల కోసం జనం జేబులకు చిల్లుపడుతోందని మండిపడ్డారు. పథకాల పేరుతో ప్రజల నుంచి పిండిన దాంట్లో 10 శాతాన్ని ప్రజలకు ఇచ్చి మిగిలిన 90 శాతాన్ని జగన్ తన జేబులో వేసుకుంటున్నారని ఆరోపించారు. ఇక, జగన్ అప్పులు…వాటికోసం పడుతున్న తిప్పలపై కాగ్ మొదలు జాతీయ మీడియా వరకు అన్ని వార్నింగ్ ఇచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా జగన్ అప్పుల గురించిన మరో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచీ ఏటా లక్ష కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేస్తున్న జగన్…గత నెలలో రూ. 4,390 కోట్లు అప్పులు చేయడం షాకింగ్ గా మారింది. ఈ తాజా అప్పుతో ఉమ్మడి ఏపీ, నవ్యాంధ్రప్రదేశ్ అప్పుల చరిత్రలో జగన్ ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రం మొత్తం అప్పులు 7.88 లక్షల కోట్లు…అంటే రాష్ట్ర జీఎస్డీపీలో ఇది 78 శాతం. కానీ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పుస్తకాల్లో చూపించిన అప్పుల శాతం మాత్రం 38 కావడం విశేషం. ఆర్టికల్ 293(3) ప్రకారం రాబోయే మూడేళ్లలో ఏపీకి ఒక్క పైసా అప్పు చేసేందుకు కూడా కేంద్రం అనుమతించకూడదు. కానీ, ఏప్రిల్ నెలలో రూ.4,390 కోట్లకు, ఆ తర్వాత రూ.28,000 కోట్ల అప్పులకు కేంద్రం ఎలా అనుమతిచ్చింది? అనేది భేతాళ ప్రశ్న.
అంతేకాదు, ఏపీకి కొత్తగా రూ.28,000 కోట్లు అప్పులకు అనుమతులివ్వడానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం వెల్లడించలేదు. ఆర్థిక శాఖ వెబ్సైట్లో కూడా వివరాలు పొందుపరచలేదు. మామూలుగా అయితే, ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం కేంద్రానికి లేదు. కానీ, జగన్-మోడీలకున్న అనుబంధంతో గుట్టు రట్టు చేయడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.