ఏపీ సీఎం జగన్.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మరో కంటితుడుపు చర్యలకు శ్రీకారం చుట్టారా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం .. తనకు తెలియదని.. ఇప్పటి వరకు పరోక్షంగా చెబుతూ వచ్చిన ఆయన కొన్నాళ్ల కిందట ప్రధాని మోడీకి లేఖ రాశారు. కేంద్ర పెద్దలకు ఈ ఫ్యాక్టరీని ఎలా నిర్వహించాలో పాఠాలు చెప్పారు. అదేసమయంలో విశాఖ ఎయిర్ పోర్టులోనూ తనను కలిసిన కార్మికులకు హామీ ఇచ్చారు.. అసెంబ్లీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి పంపుతామని చెప్పారు.
అయితే.. జగన్ ఇప్పటి వరకు చేసిన ఈ ప్రయత్నాలన్నీ.. ప్రజలను మభ్యపెట్టేందుకేనని, ఆయనకు అన్నీ తెలిసే జరుగుతున్నాయని.. తాము సీఎం జగన్తో ఒకటికి రెండు సార్లు విశాఖ ఉక్కు అమ్మకంపై చర్చించా మని.. ఈ విషయంలో తాము ఏదీ దాచలేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. పార్లమెంటు వేదికగానే కుండబద్దలు కొట్టారు.. దీంతో సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలు. ఏపీ ప్రజల కంటితుడుపు చర్యలేనని నిర్ధారణ అయిపోయింది.
ఆయనకు తెలిసే.. విశాఖ ఉక్కు అమ్మేస్తున్నారని.. సాక్షాత్తూ.. ఆయన ఎంపీ అవినాష్ రెడ్డే… పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారని.. ప్రజలకు అర్ధమైం ది. మరి ఇంత జరిగిన తర్వాత కూడా సీఎం జగన్.. మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తు న్నారననే వాదన వినిపిస్తోంది. తాజాగా ఆయన మళ్లీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. తనకు అప్పాయింట్ మెంట్ ఇవ్వాలని కోరారు. అంతేకాదు.. కార్మిక సంఘాల నాయకులు, రాజకీయ పక్షాల నాయకులను కూడా తీసుకువస్తానని… తాజాగా రాసిన లేఖలో జగన్ స్పష్టం చేయడం గమనార్హం.
అయితే.. ఇప్పటికే జగన్ తో చర్చించామని.. ఇది తమ సొత్తు కాబట్టే అమ్మేస్తున్నామని.. పార్లమెంటులోనే స్పష్టం చేసిన తర్వాత.. ఇంకా ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తానని.. అప్పాయింట్మెంట్ ఇవ్వాలని కోరడం వెనుక.. జగన్ ప్రజలను మరింత మభ్యపెడుతున్నారనేది పరిశీలకుల వాదన. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పినప్పుడు.. అప్పటి టీడీపీ ఎంపీలను రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన జగన్.. ఇప్పుడు ఆ పని వదిలేసి.. అప్పాయింట్మెంట్ అంటూ… కాలయాపన చేయడం వెనుక.. ప్రజలను మభ్యపెట్టడం.. మొసలి కన్నీరు కార్చడం తప్ప మరో ప్రయత్నం కాదని అంటున్నారు.