ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర 2.0 దిగ్విజయంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రకు టిడిపితో పాటు రాష్ట్రంలోని విపక్ష పార్టీలన్నీ మద్దతు తెలుపుతున్నాయి. ఈ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి వైసిపి నేతలు షాక్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. జగన్ సర్కారుపై ఉన్న వ్యతిరేకతంతా ఈ పాదయాత్రలో కనిపిస్తొందని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారట.
అంతేకాదు ఈ పాదయాత్ర చూసి జగన్ కు ఓటమి భయం పట్టుకుందని పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే, అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్రకు వ్యతిరేకమంటూ వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్న సంగతి తెలిసింది. ఉత్తరాంధ్రలో పాదయాత్రను అడ్డుకుంటామని మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగంగా చేసిన ప్రకటన దుమారం రేపుతోంది. జగన్ కు మహా పాదయాత్ర టెన్షన్ పట్టుకుందని, అందుకే మంత్రులతో, వైసీపీ నేతలతో ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా అంటూ ప్రాంతీయ అసమానతలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.
ఈ క్రమంలోనే వైసిపి నేతల వ్యాఖ్యలను పాదయాత్రలో పాల్గొంటున్న రైతులు ఖండించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని రైతులు స్పష్టం చేశారు. అమరావతి రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, దాని గురించి రాష్ట్ర ప్రజలకు వివరించేందుకే పాదయాత్ర చేస్తున్నామని రైతులు స్పష్టం చేశారు. తమ పాదయాత్రకు ప్రజలు మద్దతు ఇవ్వాలని తమను ఆశీర్వదించాలని కోరారు.
మరోవైపు పాదయాత్రలో పాల్గొంటున్న రైతులకు పోలీసులు ప్రత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తున్నారు. మహా పాదయాత్ర మూడో రోజున దుగ్గిరాల నుంచి ప్రారంభమైంది. స్థానికులు దారి వెంట పూలు చల్లుతూ రైతులకు తమ సంఘీభావాన్ని, మద్దతును ప్రకటించారు. అమరావతి టు అరసవల్లి మహాపాదయాత్ర జయప్రదం కావాలని స్థానికులు ఆకాంక్షించారు.
Comments 1