ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అన్న అంశంపై ఇరు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. భారీగా పోలింగ్ జరగడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కూటమి నేతలు చెబుతుండగా…మరోసారి వైసీపీ అధికారం చేపట్టాలన్న ఉద్దేశ్యంతోనే భారీగా ప్రజలు పోలింగ్ కు తరలివచ్చారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో జగన్ మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నట్లుగా తమకు సమాచారం ఉందని కేటీఆర్ అన్నారు. ఏపీ రాజకీయాలపై స్పందించాలని మీడియా ప్రతినిధులు అడగడంతో కేటీఆర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక, తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో సైలెంట్ ఓటింగ్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమని కేటీఆర్ అన్నారు. మెదక్, నాగర్ కర్నూల్, సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, కరీంనగర్, ఖమ్మం స్థానాలలో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇక, నల్గొండలో మాత్రమే కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని కేటీఆర్ జోస్యం చెప్పారు.
విద్యుత్ కోతలకు కొందరు ఉద్యోగులు కారణమని హరీష్ రావు చెప్పడంతోనే వారు కుట్రపురితంగా అలా చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ స్పందించారు. పోలీసులను, ఉద్యోగులను విమర్శించేందుకు, దూషించేందుకు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో లేరని ఆయన ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోతున్నారని చురకలంటించారు. ఉద్యోగులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఏనాడు తాము ఉద్యోగులను విమర్శించలేదని కేటీఆర్ గుర్తు చేశారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నడపడం చేతకాకే ఉద్యోగులపై ఇటువంటి విమర్శలు చేస్తున్నారని, ఉద్యోగులను అవమానించడం ఆయన స్థాయికి తగదని హితవు పలికారు.