ఏపీ ముఖ్యమంత్రి జగన్.. అనేక రూపాల్లో అనేక పథకాలు అమలు చేస్తున్నారు. అయితే.. తన ఇగో శాటిస్ఫాక్షన్ కోసం, తన ఒంటెత్తు పోకడలతో తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు తప్పు పడుతుంటే.. తలంటేస్తుంటే.. వాటిని సమర్ధించుకునేందుకు `జగనన్న కోర్టు ఫీజుల` పథకాన్నేమన్నా అమలు చేస్తున్నారా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం ఏర్పడిన ఈ 22 నెలల కాలంలో సీఎం జగన్ తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టాయి. ప్రభుత్వ కార్యాలయాలకు, పంచాయతీ ఆఫీసులకు వైసీపీ జెండా రంగులు వేయడం నుంచి.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ.. తీసుకువచ్చిన ఆర్డినెన్స్ వరకు.. అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.
ఇక, రాజధాని భూముల్లో ఏదో మతలబు ఉందంటూ.. అమరావతిని నామరూపాలు చేయాలనుకున్న వ్యూహం, అదేసమయం లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామన్న గత ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నిర్ణయాన్ని వ్యతిరేకించడం.. ఇలా చాలా వరకు జగన్ తీసుకున్న నిర్ణయాలు కోర్టులకు ఎక్కాయి. కొన్నింటిపై ప్రభుత్వమే స్వయంగా కోర్టుకు వెళ్లగా.. మరికొన్నిం టిని ప్రజాసంఘాలు, రైతులు, న్యాయవాదులు కోర్టుల్లో సవాల్ చేశారు.
నిజానికి జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధం కావని, అవి న్యాయ సమీక్షకు నిలవవని.. ఘనత వహించిన సలహాదారులు చెప్పకుండా ఉంటారా? అలాగని అనుకుంటే.. వారికి నెల నెలా ఇస్తున్న మూడున్నర లక్షల వేతనం వృథానే. అయితే.. వారు చెప్పేఉంటారు. కానీ, జగన్ తన దూకుడు స్వభావాన్ని ఎక్కడా తగ్గించుకోకుండానే ముందుకు సాగారు.
ఫలితంగా అనేక కేసులు.. కోర్టులకు ఎక్కడం.. వాటిలో పసలేకున్నా.. ప్రభుత్వం తరఫున `గట్టిగా` వాదించేందుకు ఎక్కడెక్కడ నుంచో న్యాయ వాదులను రప్పించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ప్రజాధనాన్ని మంచి నీళ్ల ప్రాయంగా కోట్లకు కోట్లు సదరు న్యాయవాదులకు కట్టబెట్టిన చరిత్ర జగన్ సొంతం చేసుకున్నారని.. రాష్ట్ర రాజకీయ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఉదాహరణకు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. రాజధాని రైతులు కోర్టుకు వెళ్లారు. దీంతో హుటాహుటిన ఢిల్లీ నుంచి ఓ పేద్ద లాయర్‌ను తీసుకువచ్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించింది. ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేయడంతోపాటు.. ఆయనకు ఏకంగా రూ.5 కోట్ల రూపాయల ఫీజు చెల్లించేందుకు సిద్ధమై..రూ.కోటి కి సంబంధించిన జీవో కూడా ఇచ్చేసింది.
దీంతో ఈ పరిణామం.. అప్పట్లో తీవ్ర వివాదమై.. ఇలా ప్రజాధనం లాయర్లకు అంత మొత్తంగా ఎలా చెల్లిస్తారంటూ.. మరో కేసు కోర్టుకెక్కింది. ప్రస్తుతం ఇది విచారణ దశలోనే ఉండడం గమనార్హం. ఇక, ఎన్నికల కమిషనర్‌గా ఉన్న నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తొలగించాలనే కుట్రతో.. పదవీ కాలాన్ని మూడేళ్లకు కుదిస్తూ.. రాత్రికిరాత్రి తెచ్చిన ఆర్డినెన్స్‌పైనా ఎస్ ఈసీ కోర్టుకు వెళ్లారు.
దీనిపైనా.. ప్రభుత్వం `వితండ వాదం` చేసేందుకు సీనియర్ లాయర్లకు.. హైకోర్టు నుంచి మొదలు పెట్టి సుప్రీం కోర్టు వరకు కోట్లు వెదజల్లిందని సొంత పార్టీలోనే అప్పట్లో గుసగుసలు వినిపించారు. అదేవిధంగా విశాఖ పట్నానికి చెందిన డాక్టర్ సుధాకర్ కేసు విషయంలోనూ.. ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని చెప్పుకొనేందుకు సీనియర్లను రాజధానికి తెప్పించేందుకు లక్షలు ధారదత్తం చేశారనే విమర్శలు ఉన్నాయి.
ఇక, రాజధాని భూములు, రైతు వివాదంపై కొనసాగుతున్న కేసుల్లో సీనియర్లకు ఇంకా ప్రజాధనాన్ని ముట్టజెబుతూనే ఉన్నారు. తాజాగా కూడా.. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు చేసిందనందుకు.. న్యాయవాదులకు రూ. 61.50 లక్షల ఫీజు విడుదల చేస్తూ.. సర్కారు వారు జీవో ఇచ్చారు. ఇలా.. ప్రభుత్వం ప్రజాధనాన్ని లేదా అప్పులు చేసి తెస్తున్న సొమ్మును.. వితండవాదాల కోసం చేస్తున్న ఖర్చుపై ఇంటా బయటా కూడా విమర్శలు వస్తుండడం గమనార్హం.
ప్రస్తుతం ఉన్న ఓ అంచనా ప్రకారం.. ఈ 22 నెలల కాలంలో.. సుమారు 500 కోట్ల వరకు ప్రభుత్వం కోర్టు ఫీజులు, రవాణా, న్యాయ వాదుల ఫీజుల కింద ఖర్చు పెట్టిందని ఓ అంచనా.. దీనిని బట్టే.. జగనన్న కోర్టుఫీజుల పథకం.. ఏపీలో కొనసాగుతోందని వ్యంగ్యాస్త్రాలు రువ్వుతున్నారు నెటిజన్లు.