ఏపీ సీఎం జగన్.. ఆయన మాతృమూర్తి, వైసీపీ గౌరవ అధ్యక్షురాలు.. వైఎస్ విజయమ్మకు మధ్య సైలెంట్ వార్ నడుస్తోందా? తల్లికుమారుడి మధ్య మాటలు లేవా? అంటీముట్టనట్టు ఉంటున్నారా? అంటే.. ఔననే గుసగుస వైసీపీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి ఇది నిజమేనా? తల్లీ కుమారుడి మధ్య వివాదం నడుస్తోందా? అనే విషయాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారాయి.
విషయంలోకి వెళ్తే.. 2019 ఎన్నికల సమయంలో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తన కుమారుడు, జగన్ను సీఎంను చేసేందుకు రోడ్డు బాట పట్టారు. ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసినప్పుడు మురిసిపోయారు.
ఇంత వరకు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం.. అంటే.. గత ఆరు మాసాలుగా మరీ ముఖ్యంగా గడిచిన నాలుగు నెలలుగా తల్లికుమారుల మధ్య దూరం పెరుగుతోందని అంటున్నారు. దీనికి కారణాలు ఎలా ఉన్నా.. గుసగుసలను నిర్ధారించే సంగతులు కూడా చోటు చేసుకోవడం.. ఇక్కడ గమనార్హం.
వైఎస్ జయంతిని సెప్టెంబరు 9న ఇడుపుల పాయలో ఘనంగా నిర్వహించారు. అయితే.. ఈ కార్యక్రమానికి అటు హైదరాబాద్ నుంచి విజయమ్మ, కుమార్తె షర్మిలలు కలిసి వచ్చారు.
ఇటు సీఎం జగన్.. తన సతీమణితో కలిసి వెళ్లారు. అయితే.. ఇడుపుల పాయలో కూడా తల్లీకుమారుడు, కోడలు.. ఎడమొహం పెడమొహంగానే ఉన్నట్టు స్పష్టంగా కనిపించింది. సాధారణంగా.. తల్లీకుమారుడు గత ఏడాది నిర్వమించిన జయంతిలో పక్కప క్కనే ఉన్నారు.
ఇక, ఈ విషయాన్ని పక్కన పెడితే.. తాజాగా జగన్ మామగారైన భారతి తండ్రి..ఈసీ గంగిరెడ్డి తొలి వర్ధంతిని పులివెందులలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షర్మిల పాల్గొనలేదు. హైదరాబాద్ నుంచి ఒక్క విజయమ్మ మాత్రమే వచ్చారు.
అంతేకాదు.. రెండు సందర్భాల్లో కుమారుడికి ఆమె చాలా దూరంగా ఉండడం.. అదేవిధంగా జగన్ కూడా డిస్టెన్స్ మెయింటెన్ చేయడం స్పష్టంగా కనిపించింది.
గంగిరెడ్డి సమాది వద్ద నివాళులు అర్పించే సమయంలో జగన్ ఒకవైపు ఉంటే.. విజయమ్మ దూరంగా ఉన్నారు. ఇక, తర్వాత నిర్వహించిన స్మారకసభలోనూ వేదికపైకి జగన్ ఎక్కలేదు. ఒక్క విజయమ్మ మాత్రమే ప్రసంగించారు. జగన్ కిందే కూర్చోగా.. విజయమ్మ మాత్రం వేదికపై కనిపించారు.
అదే సమయంలో గంగిరెడ్డి జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకావిష్కరణ సభకూడా నిర్వహించారు. ఈ పుస్తకాన్ని జగనే ఆవిష్కరించినా…. ఈ వేదికపై విజయమ్మ ఓ మూలన ఉండిపోయారు. జగన్ కానీ.. ఇతర కుటుంబ సభ్యులు కానీ.. విజయమ్మను దగ్గరకు రమ్మని పిలవకపోవడం గమనార్హం.
ఇక, కార్యక్రమం అయిన వెంటనే సీఎం జగన్.. తాడేపల్లికి వెనుదిరిగారు. ఆ సమయంలో విజయమ్మ భోజనం చేస్తున్నట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.
సో.. దీనిని బట్టి.. విజయమ్మకు.. జగన్కు మధ్య సైలెంట్ వార్ నడుస్తోందనే వాదన వినిపిస్తోంది. గత నెలలో వైఎస్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనూ జగన్ను ఆహ్వానించకపోవడం.. గమనార్హం. అయితే.. ఈ `దూరానికి` కారణం.. షర్మిల పార్టీయేనా? లేక.. ఆస్తుల వివాదాలా? లేక.. మరేదైనానా? అనే చర్చ వైసీపీలో జోరుగా సాగుతుండడం గమనార్హం.