ఏపీ సీఎం జగన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిల బెయిల్ రద్దు పిటిషన్ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నేడు నాంపల్లి సీబీఐ కోర్టు ఈ వ్యవహారంలో తుది తీర్పు వెలువరించింది. రఘురామ వేసిని పిటిషన్ ను కొట్టి వేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. అక్రమాస్తుల కేసులో జగన్, విజయసాయిల బెయిల్ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది
అంతకుముందు జగన్, విజయసాయిరెడ్డిల బెయిల్ రద్దు పిటిషన్లను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో సీబీఐ కోర్టు తుది ఉత్తర్వులు జారీ చేయకుండా కూడా ఆదేశాలివ్వాలని రఘరామ ఆ పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై విచారణను ఇతర క్రిమినల్ కోర్టులకు బదిలీ చేయాలని రఘురామ కోరారు.
కానీ, విచారణ తుది దశకు చేరుకొని తీర్పు వెలువడబోతోన్న సమయంలో వేరే కోర్టుకు బదిలీ చేయడానికి హైకోర్టు నిరాకరించింది. రఘురామ వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది.బెయిల్ రద్దు పిటిషన్ పై సిబీఐ కోర్టు తుది తీర్పునివ్వకుండా ఆదేశాలివ్వాలని రఘురామ కోరగా దానిని కూడా హైకోర్టు తిరస్కరించింది. పిటిషన్ పై బలమైన వాదనలు లేకపోవడం, సీబీఐ కూడా పిటిషనర్ వాదనను తోసిపుచ్చడంతో రఘురామకు చుక్కెదురైంది. సహేతుకమైన కారణం లేకుండా బదిలీ చేయడం కుదరదని స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు…సాక్షి మీడియాపై రఘురామ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను హైకోర్టు బదిలీ చేసింది.