ఏపీలో సీఎం జగన్ పర్యటన అంటే.. షాపులు బంద్. స్కూళ్లు బంద్, కాలేజీలు మూత. అంతేకాదు.. గంటల తరబడి ట్రాఫిక్ కు కూడా కష్టాలే! అయితే.. ఇప్పటి వరకు ఇలానే జరిగితే.. తాజాగా మాత్రం జగన్ విజయనగరంలో ఆయన పర్యటిస్తుంటే.. పోలీసులు అత్యుత్సాహంగా స్వామి భక్తి ప్రదర్శిస్తూ.. శ్రీకాకుళంలోనూ ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఇది చిత్రమైన ఘటనే అయినా.. నిజం. ఒక జిల్లాలో సీఎం పర్యటిస్తే.. ఆంక్షలు అక్కడే ఉండాలి కానీ.. పొరుగు జిల్లాల్లో ఆంక్షలు విధించడం.. గంటల తరబడి ట్రాఫిక్ నిలిపేయడం ఏంటనే సందేహం వస్తుంది కదూ!!
సీఎం జగన్ విజయనగరం జిల్లాలో పర్యటించారు. అయితే శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రయాణించే వారికి పెద్దకష్టం వచ్చిపడింది. ఎందుకంటారా? అక్కడ సీఎం పర్యటన ఉందని పోలీసులు ఇక్కడ వాహనాలు నిలిపివేశారు. సీఎం రోడ్డు మార్గాన కూడా రాలేదు. హెలీకాప్టర్‌లో భోగాపురం వద్ద దిగారు. అయినా పోలీసులు భోగాపురానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వాహనాలను నిలిపివేశారు.
ట్రాఫిక్ మూడు కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో కూడా వాహనాలు నిలిపేశారు. నాలుగు గంటల పాటు లారీల డ్రైవర్లు, సిబ్బంది నీరు, ఆహారం కోసం ఇబ్బందులు పడ్డారు. కొంతమంది డ్రైవర్లు మీడియాతో మాట్లాడుతూ 150 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉందని, మధ్యలోనే తాము సరకులు దించాల్సి ఉన్నా పోలీసులు నిలిపివేశారని అన్నారు. వాహనాలు ఆలస్యంగా వెళ్తే లారీలో సరుకులు పాడవుతాయని, ముఖ్యంగా పచ్చి వస్తువులు దెబ్బ తింటాయని ఆవేదన వ్యక్తం చేశారు.
జనసేన ఫైర్..
సీఎం జగన్ గాల్లో ప్రయాణిస్తుంటే… హైవే మీద వాహనాలు నిలిపివేయడం ఏమిటి? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కే ముఖ్యమంత్రికి.. హైవే మీద వాహనాలు ఏ విధంగా అడ్డంకి అవుతాయో అర్థం కావడం లేదన్నారు.