జగన్ పాలన అంతా రివర్సే. ఉపాధ్యాయులపై కక్షగట్టి వివిధ యాప్ల భారం మోపింది చాలక.. వారికి జీతాలివ్వకుండా ఒకప్పటి ‘బతకలేక బడిపంతులు’ సామెతను మళ్లీ నిజం చేసే దిశగా అడుగులు వేస్తోంది. గత మూడు నెలలుగా దాదాపు 30 వేలమంది టీచర్లకు జీతాలు ఇవ్వలేదు. గురుపూజోత్సవం జరిగే సెప్టెంబరులో 21వ తేదీ వరకు అందరికీ జీతాలు పడకపోవడం ప్రస్తుత దుస్థితిని తెలియజేస్తోంది. గురుపూజోత్సవం సందర్భంగా దేశమంతా గురువులను సన్మానించుకుంటున్న వేళ.. జగన్ సర్కారు మాత్రం వారికి వేతనాలివ్వకుండా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టింది.
వారు ఒకటో తేదీన వేతనాలు అందుకుని నాలుగేళ్లు దాటింది. ప్రభుత్వ ఉద్యోగులకు ఆలస్యంగానైనా జీతాలు ఇస్తుండగా.. దాదాపు 30 వేలమంది టీచర్లకు మూడు నెలలుగా ఇవ్వకుండా ఆపేసింది. టీచర్ల బదిలీల తర్వాత తప్పుల తడకగా వివరాలు నమోదు చేయడంతో ఈ దుస్థితి ఏర్పడింది. సెప్టెంబరులో మొత్తం 1.7 లక్షల మంది టీచర్లకు జీతాలు ఆపేసింది. సాంకేతిక కారణాలను చూపిస్తూ అవిగో ఇవిగో అంటూ దాటవేస్తోంది. కనీసం గురుపూజోత్సవం సందర్భంగా సెప్టెంబరు 5న అయినా జీతాలు వేస్తారని ఎదురు చూసిన గురువులకు నిరాశే మిగిలింది.
జూన్లో టీచర్ల సాధారణ బదిలీలు జరిగాయి. 60 వేల మంది టీచర్లు బదిలీ అయ్యారు. బదిలీలు జరిగిన వెంటనే పాఠశాలల వారీగా టీచర్ల వివరాలను ట్రెజరీకి పాఠశాల విద్యా శాఖ పంపించాలి. అప్పుడే ఆ వివరాలు సీఎఫ్ఎంఎస్లో కనిపిస్తాయి. టీచర్లకు ఉన్నత పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలల్లో ఎంఈవో డీడీవోగా ఉంటారు. టీచర్ల వివరాలు సీఎఫ్ఎంఎస్లో అప్డేట్ అయితే డీడీవోలు జీతాల బిల్లులు జనరేట్ చేస్తారు. ప్రతినెలా 21 నుంచి 25 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. దాంతో 1న జీతాలు అందుతాయి. కానీ ఆగస్టు నెల జీతాల విషయంలో వివరాలు అప్డేట్ కాలేదని సీఎఫ్ఎంఎస్ బిల్లులు తీసుకోలేదు. దీంతో ఇప్పటికీ బిల్లుల జనరేషన్ జరుగుతూనే ఉంది.
అనేక పాఠశాలల్లో సబ్జెక్టుల వారీగా టీచర్ల వివరాల్లో తప్పులు నమోదయ్యాయి. అక్కడ ఒక సబ్జెక్టు టీచర్ పనిచేస్తుంటే, మరో సబ్జెక్టు పోస్టు కనిపిస్తోంది. అలాగే ఈ ఏడాది కొత్తగా హెచ్ఎం పోస్టుకు అప్గ్రేడ్ చేసిన 900 ఉన్నత పాఠశాలల వివరాలు ఇంకా ఎంఈవో లాగిన్లోనే చూపిస్తున్నాయి. డీడీవో అధికారాలు హెచ్ఎంకు ఇచ్చాక, ఇంకా ఎంఈవో పేరే చూపిస్తుండడంతో వాటిని ఆపేశారు. అలాగే మొత్తం మంజూరైన పోస్టుల లెక్క కూడా తేలలేదు. ఈ ఏడాది నుంచి కొత్తగా హైస్కూల్ ప్లస్లకు వెళ్లిన 1,700 మంది టీచర్లకూ మూడు నెలలుగా జీతాల్లేవు. ఇలా మొత్తం 30 వేలమంది టీచర్లకు వేతనాలు పడడంలేదు.
ఈఎంఐల తిప్పలు
టీచర్లు గృహ రుణాలు, ఇతరత్రా రుణాలకు ఈఎంఐలు కడుతుంటారు. వాటిని నిర్ణీత సమయంలో చెల్లించకపోతే జరిమానా పడుతుంది. దీంతో ఆ సమయానికి బ్యాంకు ఖాతాలో నగదు ఉండేలా టీచర్లు జాగ్రత్తలు తీసుకుంటారు. జగన్ జమానాలో తరచూ జీతాలు ఆలస్యమవుతుండటంతో ఈఎంఐలు చెల్లించడం సమస్యగా మారింది. ఒక్కోసారి అప్పులు, చేబదులు చేయాల్సిన పరిస్థితి. ఒకట్రెండు నెలలైతే ఏదో ఒకవిధంగా ఖాతాల్లో నగదు ఉంచుతామని, ప్రతినెలా అప్పులు ఎలా చేయగలమని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థులు బూట్లు వేసుకోలేదని, నోట్ పుస్తకాలు రాయలేదని, పరీక్ష పేపర్లు దిద్దలేదని రకరకాల కారణాలతో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ టీచర్లను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆయన జిల్లాల పర్యటనకు వస్తున్నారంటేనే టీచర్లు వణికిపోతున్నారు. బోధనేతర పనులన్నీ నెత్తిన పెట్టి బోధన అంశాల్లో లోపాలను ఎత్తిచూపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. అయితే అవన్నీ సక్రమంగా చేయాలంటున్న ప్రవీణ్ ప్రకాశ్.. జీతాలు ఇవ్వకపోతే ఎందుకు పట్టించుకోవడం లేదని టీచర్లు ప్రశ్నిస్తున్నారు.