వైసీపీ నుండి ఇద్దరు సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఔటేనా ? ఇపుడిదే డౌట్ అందరిలోను పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో టికెట్ల ఖరారులో జగన్మోహన్ రెడ్డి పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ కొందరికి టికెట్లు కట్ చేస్తున్నారు. మరికొందరికి నియోజకవర్గాలను మార్చుతున్నారు. మరికొందరు ఎంఎల్ఏలను ఎంపీలుగా, ఎంపీలను ఎంఎల్ఏలుగా పోటీచేయించబోతున్నారు. ఈ ప్రక్షాళనలో టికెట్లు దక్కనివాళ్ళలో కొందరు పార్టీలో నుండి బయటకు వచ్చేస్తున్నారు. అయితే మరికొందరిని బయటకు వెళ్ళేట్లుగా జగనే పొగబెడుతున్నారనే ఆరోపణలు పెరిగిపోతున్నాయి.
ఈ నేపధ్యంలోనే ఒంగోలుకు సంబంధించి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసరెడ్డి తొందరలోనే వైసీపీ నుండి బయటకు వచ్చేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. కారణం ఏమిటంటే ఒంగోలు ఎంపీగా చంద్రగిరి ఎంఎల్ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోటీచేయించాలని జగన్ డిసైడ్ అయ్యారట. ఎంపీగా చెవిరెడ్డి పోటీ అంటే ఎంఎల్ఏగా బాలినేని కూడా పోటీకి దూరంగా ఉంటారనే అనుకుంటున్నారు. ఎందుకంటే మాగుంటకు ఎంపీగా టికెట్ ఇస్తేనే ఎంఎల్ఏగా తాను పోటీచేస్తానని మాజీమంత్రి పట్టుబట్టి కూర్చున్నారు.
మాగుంటను ఎంపీగా పోటీచేయించటం బహుశా జగన్ కు ఇష్టం ఉన్నట్లు లేదు. అందుకనే పార్లమెంటు సీటు విషయాన్ని పక్కనపెట్టి కేవలం ఒంగోలు అసెంబ్లీ టికెట్ మాత్రమే బాలినేనితో మాట్లాడారు. ఈ వివాదం ఎంతకి తెగటంలేదు. దాంతో జగన్ సడెన్ గా ఎంపీగా చెవిరెడ్డిని పిక్చర్లోకి తెచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం. చెవిరెడ్డి కూడా పోటీచేయటానికి రెడీ అయిపోయారట. అంటే ఒకేసారి మాగుంట, బాలినేనికి జగన్ చెక్ పెట్టబోతున్నారా అనే ప్రచారం పెరిగిపోతోంది.
చెవిరెడ్డి ఎంపీగా పోటీచేయటం ఖాయమైపోతే ఎంఎల్ఏగా బాలినేని ప్లేసులో కొత్త నేతకు అవకాశం దొరుకుతుంది. టికెట్లు దక్కనపుడు ఇక ఇద్దరు వైసీపీలో ఎందుకుంటారు ? ఏదో పార్టీలోకి వెళ్ళి పోటీకి ప్రయత్నిస్తారు ? కాకపోతే ఆ పార్టీలు టీడీపీ, జనసేన,కాంగ్రెస్ లో ఏవన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ అంతే. ఎందులోను గెలుపు అవకాశాలు లేవని అనుకుంటే అప్పుడు వాళ్ళేమి చేస్తారో చూడాలి. మొత్తంమీద ఇద్దరు సిట్టింగులు పార్టీ నుండి ఔటనే ప్రచారమైతే పెరిగిపోతోంది.