కేంద్ర పాలిత ప్రాంతమైన.. పుదుచ్చేరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తాజాగా ఇక్కడి ఫలితం వెల్లడైంది. అయితే.. ఇందులో చిత్రంగా.. ఏపీ జగన్ నుంచి పరోక్షంగా అన్ని విధాలా సంపూర్ణ సహకారాలు ఉన్న ఎన్ రంగస్వామి పరాజయం పాలయ్యారు.
వాస్తవానికి జగన్‌పై ఉన్న నమ్మకంతోనే ఇక్కడ నుంచి రంగస్వామి బరిలో నిలిచినట్టు ఎన్నికలకు ముందు ప్రకటించారు. దీంతో జగన్ తన పరివారాన్ని అక్కడ కు పంపించి మరీ ప్రచారం చేయించారు. అయినా.. ఓడిపోయారు. మరి ఏం జరిగింది? అనేది ఆసక్తిగా మారింది.
విషయంలోకి వెళ్తే.. పుదుచ్చేరి పరిధిలోకి వచ్చే యానాం అసెంబ్లీ నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లా సమీపంలోనే ఉంటుంది. ఇక్కడ నుంచి అనేక సార్లు విజయం దక్కించుకున్న ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావుకు వైఎస్ కుటుంబంతోను, ముఖ్యమంత్రి జగన్‌తోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నా యి.
ఈ క్రమంలోనే ఆయనకు అన్ని విధాలా సహకరించేందుకు జగన్ ముందుకు వచ్చారు. అయితే.. ఇటీవల జరిగిన పుదుచ్చేరి ఎన్నికల్లో ఇక్కడ నుంచి మల్లాడి తప్పుకొని.. ఎన్ఆర్ కాంగ్రెస్ (బీజేపీ కూటమిలో ప్రధాన పార్టీ) అధినేత ఎన్.రంగస్వామిని బలపరిచారు.
ఈ క్రమంలో యానాంలో రంగస్వామిని గెలిపించేందుకు తూర్పుగోదావరికి చెందిన వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడ పర్యటించి ప్రచారం చేశారు. అయితే.. అప్పటికే వైసీపీలో ఒకరిలో ఒకరు వివాదాలు పడుతున్నారు. ఆధిపత్య రాజకీయాలు కూడా సాగుతున్నాయి.
అయినప్పటికీ.. రంగస్వామి తరఫున ప్రచారానికి దిగారు. కానీ, మాటలు కలిసినా మనసులు కలవలేదన్నట్టుగా.. వైసీపీ నాయకులు వ్యవహరించారు. దీంతో జగన్ మద్దతు ఉన్నప్పటికీ.. రంగస్వామి ఓడిపోయారు. దీనిని బట్టి.. వైసీపీ వర్గ రాజకీయాలే రంగస్వామిని ఓడించాయని అంటున్నారు పరిశీలకులు.
అయితే.. ఈ విషయంలో పెద్ద ట్విస్ట్ ఏంటంటే.. యానాంతోపాటు రంగస్వామి.. మరో నియోజకవర్గం తట్టాన్చావడిలోనూ పోటీ చేశారు. ఈ క్రమంలో ఇక్కడ విజయం దక్కించుకున్నారు. దీంతో ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత ఎన్.రంగస్వామి పుదుచ్చేరి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం ఖాయమైపోయింది. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఈ కూటమి తరఫున ఎన్ఆర్ కాంగ్రెస్ 16, బీజేపీ 9, అన్నాడీఎంకే 5 స్థానాల్లో పోటీ చేశాయి. ఎన్ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6 చోట్ల విజయం సాధించాయి.
ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన(మ్యాజిక్ ఫిగర్) 16 స్థానాలను ఈ కూటమి ఇప్పటికే దక్కించుకో వడంతో ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైపోయింది. మరో ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించడంతో వారిని కూడా దరి చేర్చుకునే సన్నాహాల్లో ఎన్డీఏ నేతలు ఉన్నారు.
కాగా, మొన్నటి వరకూ ఇక్కడ అధికారంలో ఉన్న యూపీఏ కూటమి ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూసింది. మొత్తంగా.. యానాంలో మాత్రంజగన్ వ్యూహం ఫలించలేదని అంటున్నారు పరిశీలకులు.