కొన్ని రోజులే అయింది. గుంటూరు జిల్లాలో జగన్ సర్కారు పేద ప్రజలకు పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. దాని గురించి ప్రభుత్వం చేసుకున్న ప్రచారం అంతా ఇంతా కాదు. రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో పనికి రాని స్థలాలను పేదలకు పంపిణీ చేశారని.. ఇళ్ల నిర్మాణం ఊసే ఎత్తట్లేదని విమర్శలు ఎదుర్కొంటున్న జగన్ ప్రభుత్వం.. అమరావతిలో మాత్రం హడావుడిగా ఖరీదైన స్థలాలను పెద్ద ఎత్తున పేదలకు పంపిణీ చేసింది.
ఇందుకోసం గత ప్రభుత్వం రాజధాని నిర్మాణంలో భాగంగా తీర్చిదిద్దిన సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ను చెడగొట్టి మరీ.. కొత్తగా ఆర్-5 జోన్ అని ఒకటి ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రణాళిక రచించారు. కేవలం చంద్రబాబు సర్కారు ప్రణాళికలను దెబ్బ కొట్టడమే లక్ష్యంగా ఈ ఇళ్ల స్థలాల పంపిణీ జరిగిందన్నది స్పష్టం. ఈ స్థలాలకు సంబంధించి కేసులు కోర్టులో నడుస్తున్నాయని.. ఇళ్ల స్థలాల పంపిణీ, నిర్మాణం అంత తేలిక కాదని అందరికీ తెలిసినా జగన్ సర్కారు మాత్రం లబ్ధిదారులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడంపైనా చర్చ జరిగింది.
ఈ కేసులు కోర్టులో ఉన్న సంగతి జగన్ అండ్ కోకు తెలియంది కాదు. కానీ జగన్ మాత్రం ఆ సభలో ఘనంగా ఒక ప్రకటన చేశారు. హైకోర్టు, సుప్రీం కోర్టులో పోరాడి మరీ అన్నీ కేసులూ గెలిచి ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తున్నామని చెప్పుకున్నారు. కోర్టులు కేసులో నడుస్తుండగా. ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బహిరంగ సభలో ప్రకటన చేయడం ఏంటా అని అందరూ విస్తుబోయారు. కట్ చేస్తే ఈ రోజు ఆర్-5 జోన్లో ఇళ్ల స్థలాలు పంపిణీ, నిర్మాణాలకు బ్రేక్ వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. మరి ఆ రోజు జగన్ చేసిన ప్రకటనపై ఈ రోజు ఆయన, వైసీపీ వాళ్లు ఏం సమాధానం చెబుతారన్నది ప్రశ్న.