తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడిన వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. లడ్డూ కల్తీ చేసిన పాపం వైసీపీ ప్రభుత్వానిదేనని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే, కూటమి ప్రభుత్వం చేస్తున్నవి తప్పుడు ఆరోపణలని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై ప్రధాని మోడీకి వైసీపీ అధినేత జగన్ ఓ లేఖ రాశారు. తాజాగా ఆ లేఖపై విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. అయితే, జగన్ బురద రాజకీయాలు మానుకోవాలని, తిరుపతి లడ్డూ కల్తీ వ్యవహారంలో జగన్ ను అరెస్ట్ చేయాలని చిన్ని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి జగన్ రాసిన ఉత్తరంలో టీటీడీ లడ్డూ కల్తీ విషయంలో సీబీఐ విచారణ ఎందుకు కోరలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగన్ తో పాటు కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన గత ప్రభుత్వ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యన్నారాయణను కూడా అరెస్టు చేయాలని కోరారు. అంతేకాదు, గత ప్రభుత్వ హయాంలో టీటీడీ బోర్డు సభ్యులను కూడా విచారణ జరపాలని అన్నారు. ఇక, విజయవాడ వరద బాధితులకు నష్టపరిహారం గురువారం నుంచి పంపిణీ చేస్తామన్నారు. బెజవాడలో ‘ఇది మంచి ప్రభుత్వం’ ఇంటింటి ప్రచార కార్యక్రమంలో చిన్ని పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు వల్లే విజయవాడ వరద విపత్తు నుంచి బయట పడగలిగిందదని చెప్పారు. కాగా, లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించినట్టు తెలుస్తోంది. సిట్ ను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.