వలంటీర్లను వందశాతం వైసీపీ కార్యకర్తలుగా మార్చేసే కార్యక్రమం పూర్తయింది. ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ (ఎఫ్ఏవో) రంగంలోకి దిగి వీళ్లకు ‘స్పెసల్ క్లాసులు’ కూడా తీసుకుంది. విచిత్రమేమిటంటే… వలంటీర్లకు, ఎఫ్ఏవో ప్రతినిధులకూ ప్రభుత్వ ధనాన్నే జీతాలుగా చెల్లిస్తున్నారు. కానీ… వారు పని చేసేది మాత్రం అచ్చంగా వైసీపీ కోసం.. జగన్ కోసం! వలంటీర్లపై పర్యవేక్షణకే ఎఫ్‌వోఏను నియమించారు. ఇప్పుడు… సచివాలయాల్లోనే మీటింగ్‌లు పెట్టి వలంటీర్లకు మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నారు.
‘తమ వారు’కారనే చిన్న అనుమానం ఉన్నా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తారని భావించినా… ఆ వలంటీర్లను ముందే గుర్తించి బయటికి పంపిస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన వాళ్లకు ‘కర్తవ్య బోధ’ చేస్తున్నారు. తమ పరిధిలో ఉన్న ప్రతి ఇంటికీ వెళ్లి తమ ఆదేశాల మేరకు ప్రచారం చేయాలని స్పష్టం చేస్తున్నారు. ‘ప్రజలను మాయ చేయండి’ అని చెబుతున్నారు. వలంటీర్లపైనా వల వేస్తున్నారు. ‘మీరు ఫుల్‌టైమ్ వైసీపీ కోసమే పని చేయండి. ఎన్నికల తర్వాత మీ పరిస్థితి మారిపోతుంది. ఈ విషయాన్ని జగన్ మీకు రహస్యంగా చెప్పమన్నారు’ అని అంతర్గత సమావేశాల్లో చెబుతున్నారు.
జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం వలంటీర్ల అవసరమన్నట్లుగా నూరిపోస్తున్నారు. ఇప్పటి నుంచే ఓట్లకు గేలం వేసే పనిలో ఉండాలని, అందుకు అవసరమైన సహకారం ప్రభుత్వం నుంచి అందుతుందని పేర్కొంటున్నారు. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని వలంటీర్లు చెప్పినప్పుడు… అన్నీ జగనన్న చూసుకుంటారని ఎఫ్ఏవో ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇక మండల స్థాయి అధికారులు (ఎంఎల్వో) నుంచి వలంటీర్లకు ప్రత్యేక సందేశాలు కూడా వెళ్తున్నాయి. సేవారత్న అవార్డు కింద ప్రతి వలంటీర్‌కు రూ.20 వేల నగదు ఇస్తామని, ఎన్నికల తర్వాత జీతాన్ని రూ.10 వేలుకు పెంచుతామని ఆశ పెడుతున్నారు.
పింఛన్ పంపిణీని మినహాయిస్తే… వలంటీర్లు చేస్తున్న ప్రతి పనీ జగన్ రాజకీయాలతోనే ముడిపడి ఉంది. ఇక… ఫిబ్రవరి 1వ తేదీ పింఛను పంపిణీ తర్వాత పూర్తిస్థాయి వైసీపీ కార్యకర్తలుగా అవతరించాలని ఎంఎల్వోలు వలంటీర్లకు స్పష్టం చేస్తున్నారు. దీనిపై వారందరికీ వాట్సాప్ సందేశాలు పంపిస్తున్నారు. ‘‘ఫిబ్రవరి నుంచి పింఛన్ పంపిణీ తప్ప ఇతర పనులు ఉండవు. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సేవలు అందించాలి. వలంటీర్లందరూ యాక్టివ్‌గా ఉండాలి. లేకుంటే విధుల నుంచి తొలగిస్తాం’’ అని బెదిరిస్తున్నారు. త్వరగా కులగణన పూర్తి చేస్తే… వలంటీర్లకు శిక్షన ఉంటుందని చెబుతున్నారు. ఇక… ‘సేవా రత్న’ పేరుతూ అందరికీ పారితోషికం ఇస్తామని వల వేస్తున్నారు.
పొలిటికల్ ఫాంటసీ చిత్రం…
జగన్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో అభివృద్ధిని అటకెక్కించారు. అమరావతి లేదు. పోలవరం పూర్తి కాదు. పెట్టుబడులు రావు. పరిశ్రమలు లేవు. రోడ్లు వేయలేదు. ఇళ్లు కట్టలేదు. కట్టిన టిడ్కో ఇళ్లూ ఇవ్వలేదు. ఎప్పటి నుంచో అమలులో ఉన్న పథకాల పేరు, అమలు తీరు మార్చి బటన్ నొక్కడమే జగన్ చేస్తున్నది. ఈ సభలలో కూడా బటన్ నొక్కుడుపై గొప్పలు, విపక్షాలపై విమర్శలు తప్ప అంతకుమించి చేసిందేమిటో జగన్ చెప్పుకోలేకపోతున్నారు. అయినా సరే… వచ్చే ఐదేళ్లలో అద్భుతాలు సృష్టిస్తారని, ఆదాయం పెంచేస్తారని, అడ్డగోలుగా చేసిన అప్పులు కూడా తీర్చేస్తారని, పథకాలు బ్రహ్మాండంగా అమలు చేస్తారంటూ ప్రజలకు ‘పొలిటికల్ ఫాంటసీ సినిమా’ చూపించాలని వలంటీర్లను ఆదేశిస్తున్నారు.
‘ఈ ఎన్నికలు వలంటీర్లకు చావు బతుకుల సమస్యలాంటివి. జగన్ మిమ్మల్నే నమ్ముకున్నారు. మిమ్మల్ని నమ్ముకునే ఎమ్మెల్యేలను, మంత్రుల నియోజకవర్గాలు కూడా మార్చేస్తున్నారు! ‘రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకంటే వలంటీర్లే కీలకమవుతారు. అదే జగనన్న ప్రభుత్వ ప్రత్యేకత. ఈ రెండు నెలల సమయం చాలా విలువైనది. ప్రతి వలంటీర్ ప్రభుత్వానికి మన సేవలు అందించే సమయం వచ్చింది. కనుక అందరూ యాక్టివ్‌గా ఉండాలి’ అని ఎంఎల్వోలు ‘సందేశ’ ఆదేశాలు పంపుతున్నారు.
ఎన్నికల వేళ రూ.392 కోట్ల కానుకలు
రోడ్లు ఏమైపోయినా ఫర్వాలేదు. చిన్నచిన్న పనులు చేసిన కాంట్రాక్టర్లు బిల్లులు రాక రోడ్డున పడ్డా పట్టించుకోరు. ఉద్యోగులకు వేలకోట్లు బకాయిలు పడినా బేఫికర్! ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికుల డిమాండ్లకు దిక్కులేదు. కానీ… వలంటీర్లను మాత్రం చక్కగా చూసుకోవాలి! ఇస్తామన్న దానికన్నా, ఇస్తున్న దానికన్నా ఎక్కువ పారితోషికం ఇవ్వాలి! బిరుదులతో సత్కరించాలి! ఎందుకంటే… వారిని వలంటీర్లుగాకంటే, తమ సొంత సైన్యంగానే వైసీపీ భావిస్తోంది! భావించడం కాదు… ‘మీరు మా సైన్యమే’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఎన్నికల ముందు వారికి ‘ప్రత్యేక’ తాయిలాలు అందించారు.
సేవా మిత్ర, రత్న, వజ్ర అనే బిరుదులతో… ఏకంగా రూ.392 కోట్ల పారితోషికం అందించారు. ‘అందుచేత… మీరు నాకు రుణ పడి ఉండాలి’ అని తేల్చేశారు. ఇదే రూ.400 కోట్లతో ప్రభుత్వ ఉద్యోగులు, చిరుద్యోగులకు సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించవచ్చు. డిమాండ్లను నెరవేర్చవచ్చు. కానీ… అవన్నీ పెండింగ్! వలంటీర్లకు మాత్రమే వరాలు! రాష్ట్రంలో 2.60 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. వారికి ప్రతి నెలా రూ.5 వేల గౌరవ వేతనం, పేపర్ బిల్లు ఠంఛనగా చెల్లిస్తున్నారు. గౌరవ వేతనం రూపంలోనే ఏటా రూ.1530 కోట్లు ఇస్తున్నారు.
ఇది కాదని… ప్రతి ఏటా సేవామిత్ర, రత్న, వజ్ర పేరుతో ప్రత్యేక పారితోషికం చెల్లిస్తున్నారు. ఈ ఏడాది ఆ నగదు బహుమానాలను సేవా మిత్రకు రూ.10 వేల నుంచి రూ. 15 వేలు, సేవా రత్నకు రూ.20 వేల నుంచి రూ. 30 వేలు, సేవ వజ్ర పురస్కారానికి రూ.30 వేల నుంచి రూ. 45 వేలకు పెంచారు. ఇందుకోసం రూ. 392 కోట్లు తాజాగా విడుదల చేశారు. అసలు విషయం ఏమిటంటే… తమకు అవసరమైన వారికి డబ్బులు సమర్పించుకునేందుకు సర్కారుకు ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. కానీ… ఇతర వర్గాలకు చట్టబద్ధంగా, శాసనబద్ధంగా చేయాల్సిన చెల్లింపులు మాత్రం జరగవు. ఉద్యోగుల పరిస్థితి మరీ ఘోరం. సర్కారు వారి దృష్టిలో ఉద్యోగులు సవతి పిల్లలైతే, వలంటీర్లు సొంత పిల్లలు!
ఉద్యోగులకేవీ పారితోషికాలు?
ప్రతి ఏటా స్వాతంత్య్ర దినోత్సవం రోజు జిల్లాల వారీగా, శాఖలవారీగా అసమాన ప్రతిభ కనబర్చిన ఉద్యోగులు దాదాపు 100 మందికి సీఎం చేతుల మీదుగా అవార్డులు ఇవ్వడం సంప్రదాయం. టీడీపీ హయాంలోనూ, ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇది కొనసాగింది. ఈ అవార్డులకు ఎంపికైన ఉద్యోగులకు మెరిట్ సర్టిఫికెట్‌తోపాటు రూ.20,000 నగదు పురస్కారాన్ని సీఎం చేతులమీదుగా అందించేవారు. ఈ సర్టిఫికెట్ బయట శాఖల్లో ఉద్యోగం చేయడానికి, ఐఏఎస్ కన్ఫర్మేషన్ జాబితాలో అదనపు పాయింట్లు తెచ్చుకోవడానికి ఉపయోగపడేవి.
కానీ, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ఏడాది కూడా రాష్ట్రస్థాయిలో ఉద్యోగులకు అవార్డులు ఇవ్వలేదు. వలంటీర్లను ప్రసన్నం చేసుకునేందుకు మాత్రం ఖజానా నుంచి వందల కోట్లు గుమ్మరిస్తోంది. సాధారణ ఉద్యోగులు రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 16(1) ప్రకారం నియమితులైన వారు. వీరి ఉద్యోగాలకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. వలంటీర్లను కేవలం ఎన్నికల అవసరాలకే ఉపయోగించుకున్నట్లు వైసీపీ పెద్దలే అంగీకరిస్తున్నారు. అందుకే… ఉద్యోగులకంటే వలంటీర్లకే పెద్దపీట వేస్తున్నారు.
వీటికి దిక్కులేదు కానీ…
రెగ్యులర్ ఉద్యోగులు ఏళ్ల తరబడి జమ చేసుకుంటున్న జీవిత బీమా క్లెయిమ్‌లు రూ.300 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ క్లెయిమ్‌లు పరిష్కరించి డబ్బులివ్వాలని ఉద్యోగులు కాళ్లరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి ఉద్యోగి వేతనం నుంచి మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్ చేస్తున్నారు. కానీ, ఆస్పత్రులకు చెల్లించడంలేదు. వారికి వైద్యసేవలు అందడం లేదు. మెడికల్ క్లెయిమ్‌ల బిల్లులు క్లియర్ కాక చెదలు పడుతున్నాయి. ఈ మొత్తం ఖర్చు కూడా రూ.300 కోట్లలోపే ఉంటుంది. అయినా చెల్లింపుల్లేవు. సరెండర్ లీవు బిల్లులు మూడేళ్లుగా గ్రీన్చానల్లోనే ఉన్నాయి ఈ బిల్లులు కూడా రూ.300 కోట్లలోపే ఉంటాయి.
ఇవేవీ చెల్లించలేదు. జీపీఎఫ్ క్లెయిమ్స్ విలువ కూడా రూ.300 కోట్లలోపే ఉంటుంది. ఇవి ఉద్యోగుల జీతం నుంచి కట్ చేసిన డబ్బే. కానీ… ఉద్యోగులకు అందడంలేదు. ఆశావర్కర్లు, ఎస్ఎస్ఏ, పారిశుధ్య కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులు అడుగుతున్న వేతన పెంపు విడివిడిగా చూస్తే రూ.400 కోట్లలోపే ఉంటుంది. కానీ, వీరెవరూ ఎన్నికల్లో పనికిరారనేది జగన్ సర్కార్ అభిప్రాయం. అందుకే, వీరి మొర ఆలకించడంలేదు. వలంటీర్లను మాత్రం రూ.392 కోట్లతో ప్రత్యేకంగా సన్మానించడంపై ఉద్యోగ వర్గాల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్‌కు వారే సర్వస్వం
వలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. వారిని ఎన్నికల ప్రక్రియకు పూర్తి దూరంగా ఉంచాలని.. ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టకూడదని తేల్చి చెప్పింది. కానీ, అధికార పార్టీ వైసీపీ మాత్రం ఈ ఎన్నికల్లో సొంత నేతలు, కార్యకర్తలకంటే వలంటీర్లనే ఎక్కువగా నమ్ముకుంది. వారి ‘సేవలను’ రాజకీయంగా వాడుకునేందుకు భారీ వ్యూహం రచించింది. దీని ప్రకారం.. వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులను అధికారులు వెనక్కి తీసుకుంటున్నారు.
ఇకపై మరింత విచ్చలవిడిగా వలంటీర్లు వైసీపీ సేవ చేసేలా రంగం రెడీ చేశారు. ఎవరైనా ప్రశ్నించినా, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా.. ‘‘వాళ్లు ఇప్పుడు ప్రభుత్వ విధుల్లో లేరు. సిమ్ కార్డులు ఇచ్చేశారు’’ అని తప్పించుకోవచ్చన్నది వైసీపీ వ్యూహం. వలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారు. విశాఖపట్నం సహా పలు జిల్లాల్లో వలంటీర్లు వైసీపీ అభ్యర్థులతో కలిసి బహిరంగంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
వారికి ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న జీతంతో పాటు తాము కూడా అంతకు రెట్టింపు జీతాలిస్తామని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో వలంటీర్లు పూర్తిస్థాయి కార్యకర్తలుగా మారి, ఆయా కుటుంబాల వద్దకు వెళ్లి గుర్తులు చెప్పి మరీ ఓటు వేయాలని కోరుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు వలంటీర్లకు తాయిలాలు ఇవ్వడం ప్రారంభించారు. పలు చోట్ల కుక్కర్లు, మరికొన్ని చోట్ల సెల్ఫోన్లు కూడా పంపిణీ చేస్తున్నట్టు సమాచారం.