అనంతపురం జిల్లా రాప్తాడు వద్ద ఏర్పాటు కావాల్సిన పేజ్ ఇండస్ట్రీస్ (జాకీ) సంస్థ తెలంగాణకు తరలిపోయిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బెదిరింపుల నేపథ్యంలోనే ఈ సంస్థ తెలంగాణకు తరలి వెళ్లినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. తోపుదుర్తి డబ్బుతోపాటు తాను చెప్పిన వారికే సబ్ కాంట్రాక్టులు ఇవ్వాలని హుకుం జారీ చేయడంతోనే ఆ కంపెనీ ఏపీకి రాంరాం చెప్పిందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టిడిపి అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.
ఈ క్రమంలోనే జగన్ పై, వైసీపీ నేతలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలకులు రాక్షసులు అయితే ఫలితాలు ఎలా ఉంటాయో మన రాష్ట్రమే మంచి ఉదాహరణ అని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమలో తాము తెచ్చిన పరిశ్రమలు నేడు ఎందుకు వెళ్లిపోయాయి అంటూ చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాయలసీమ ద్రోహులు ఎవరు అని చంద్రబాబు ప్రశ్నించారు.
సీమకు పరిశ్రమలు తెచ్చిపెట్టిన తాము రాయలసీమ ద్రోహులమా లేక కాసులకు కక్కుర్తి పడి కంపెనీలను వెళ్ళగొట్టిన మీరు రాయలసీమ ద్రోహులా అని చంద్రబాబు ప్రశ్నించారు. నేతలను మేపలేక జాకీ పరార్ అంటూ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేస్తూ చంద్రబాబు చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. మరోవైపు, తిరుపతిలో నడిరోడ్డుపై మహిళ ప్రసవించిన ఘటనపై కూడా చంద్రబాబు స్పందించారు.
ఆ ఘటన తన గుండెను కలచివేసిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తోడుగా సహాయకులు లేకుండా పురిటి నొప్పులతో వచ్చిన నిండు గర్భిణిని ప్రసూతి ఆస్పత్రి సిబ్బంది ఆస్పత్రిలో చేర్చుకోకపోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు దుప్పట్లో అడ్డుపెట్టి ప్రసవం చేయించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని, అందుకు కారకులు ఎవరని చంద్రబాబు ప్రశ్నించారు. ఎలా చెబితే ఈ ప్రభుత్వానికి అర్థం అవుతుందని చంద్రబాబు నిలదీశారు.
మరోవైపు, జగన్ నరసాపురం పర్యటన నేపథ్యంలో రోడ్డు పక్కన ఉన్న పెద్ద చెట్లను అధికారులు నరికి వేసిన ఘటనపై కూడా చంద్రబాబు స్పందించారు. మొక్కలు నాటే ప్రజాప్రతినిధులను చూశానని, ఇలా రోడ్డుకి ఏమాత్రం అడ్డు లేని భారీ వృక్షాలను సైతం నరికి వేయించే ముఖ్యమంత్రిని ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని చంద్రబాబు విమర్శించారు. ఇదేం కర్మ రాష్ట్రానికి? నువ్వు జగన్ రెడ్డి… కాదు రివర్స్ రెడ్డి అంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు.