మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి విచిత్రంగానే ఉంటోంది. తాజాగా భారీ వర్షాలు, వరద బాధితులను జగన్ పరామర్శించిన విషయం తెలిసిందే. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లోని అనేక మంది బాధితులను జగన్ వ్యక్తిగతంగా కలిశారు. ఎంతోమందితో భేటీ అయ్యారు. తర్వాత జిల్లాల యాంత్రాంగంతో సమీక్షలు కూడా నిర్వహించారు. ముఖ్యమంత్రిగా జగన్ పై పనులన్నీ చేయటంలో తప్పు కానీ వింత కానీ ఏమీ లేదు. కాకపోతే కరోనా వైరస్ సమస్య ఇంకా సమసిపోలేదు. పైగా ఒమిక్రాన్ వైరస్ విజృంభిస్తోందనే ఆందోళన పెరిగిపోతోంది.
ఇలాంటి నేపథ్యంలో జనాల్లో తిరిగిన సీఎం కనీసం మొహానికి మాస్కు కూడా పెట్టుకోలేదు. ఎలాంటి మాస్కు పెట్టుకోకుండానే జనాల్లో తిరిగేయటం, బాధితుల్లో కొందరి ఇళ్ళలోకి వెళ్ళి మరీ పరామర్శించారు. తర్వాత యంత్రాంగంతో సమీక్షలు నిర్వహించిన సమయంలో కూడా జగన్ కు మాస్కు కనబడలేదు. ఇదే మొదటిసారి కాదు మొదటి నుండి జగన్ వ్యవహారం ఇలాగే ఉంది. తాడేపల్లి క్యాంపాఫీసుల్లో జరిగే సమీక్షా సమావేశాల్లో కూడా జగన్ మాస్కు పెట్టుకున్న దాఖలాల్లేవు.
మొన్నటికి మొన్న హైదరాబాద్ లో జరిగిన ఓ వివాహానికి హాజరయ్యారు. ఇదే వివాహానికి కేసీయార్ తో పాటు ఎంతో మంది ప్రముఖులు కూడా వచ్చారు. వీళ్ళల్లో చాలామంది మాస్కులు ధరించినా జగన్ మాత్రం పెట్టుకోలేదు. గతంలో రాష్ట్రంలో పర్యటించినపుడు కానీ ఢిల్లీకి వెళ్ళిన సందర్భాల్లో కూడా మాస్కులు లేకుండానే తిరిగారు. ఒకసారి ప్రధానమంత్రి, మరోసారి హోంశాఖ మంత్రి అమిత్ షా తో జరిగిన భేటీల్లో మాత్రమే మాస్కు పెట్టుకున్నారు.
కరోనా వైరస్ నిబంధనల్లో భౌతిక దూరం పాటించటం, శానిటైజర్ వాడటం ఎంత ముఖ్యమో మాస్కు ధరించడం కూడా అంతే ముఖ్యం. ఆరడుగుల భౌతిక దూరం పాటించటం ఎలాగు సాధ్యంకాదు. మాటిమాటికి శానిటైజర్నూ ఉపయోగించలేరు. అందుకనే మాస్కును తప్పనిసరిగా ధరించాల్సిందే అని వైద్య నిపుణులు స్పష్టంగా అనేకసార్లు చెప్పారు. అయినా పాటించకపోతే ఎవరూ చేసేదేమీ లేదు.
మామూలు జనాలు నిబంధనలను పాటించకపోయినా పోనీలే అనుకోవచ్చు. ముఖ్యమంత్రే నిబంధనలను పాటించకపోతే మిగిలిన వాళ్ళకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నట్లు ? రేపెవరైనా మాస్కు పెట్టుకోకుండా నిబంధనలు ఉల్లంఘించినపుడు జగన్నే ఉదాహరణగా చూపితే అపుడు సీఎం ఏమని సమాధానం చెబుతారు ? తానే నిబంధనలను ఉల్లంఘిస్తూ మిగిలిన వారిని మాత్రం నిబంధనలు పాటించాలని జగన్ ఎలా చెప్పగలుగుతారు ?