రాజకీయాల్లో ఉన్న నాయకులు ఏం చెప్పినా.. వాటిని ప్రజలునమ్మేస్తారని అనుకోలేం. ఎందుకంటే.. ఇప్పుడు రోజులు మారా యి. నాయకులు మారకపోయినా.. ప్రజలు వారు చెబుతున్న విషయాలపై దృష్టి పెడుతున్నారు. నాయకులు ఏం చెబుతు న్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనేది చాలా దగ్గరగా చూస్తున్నారు. దీంతో నాయకులు విశ్వరూపం సెల్ ఫోన్ రికార్డులకు ఎక్కి వారి నిజరూపాన్ని సాక్షాత్కరింప చేస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావనకు వస్తోందంటే.. ఏపీ సీఎం జగన్ తాజాగా తమ సొంత జిల్లా కమలాపురంలో నిర్వహించిన సబలో చేసిన కామెంట్ల కారణంగానే!
సీఎం ఏమన్నారు..?
ఇంతకీ సీఎం జగన్ ఏమన్నారో చూస్తే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేతను డిఫెన్స్‌లో పడేయాలని భావించిన సీఎం జగన్.. వెంటనే చంద్రబాబు ఖమ్మంలో చేసిన సభను పరోక్షంగా ప్రస్తావించారు. “నాకు ఒక రాష్ట్రం కాకపోతే.. మరో రాష్ట్రం లేదు. ఇదే నా రాష్ట్రం.. ఈ ఐదు కోట్ల మంది మాత్రమే నా ప్రజలు. వీరి కోసమే ఉన్నాను. వీరి కోసమే రాజకీయం చేస్తాను.. చేస్తున్నాను“ అని చెప్పారు. అంటే.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారనే విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు. అంతేకాదు.. విశ్వసనీయతకు నేను మారు పేరు అని వ్యాఖ్యానించారు.
ఏది నిజం?
అయితే.. జగన్ చేసిన వ్యాఖ్యల్లో ఏది నిజం? అనేది చూస్తే.. చాలా డొల్ల తప్ప.. ఇంకేమీ కనిపించడం లేదు. ఎందుకంటే.. ఆయన చెప్పినట్టు ఏపీ కోసమే రాజకీయాలు చేస్తానని చెబుతున్న ఆయన 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ఎందుకు పోటీ చేశారు? నిజానికి ఏపీపై ప్రేమ ఉంటే.. ఇక్కడే రాజకీయం చేయాలి. ఇక్కడే పోటీకి పరిమితం కావాలి. కానీ, ఆయన అలా కాలేదు.
ఇక, 2019 వరకు జగన్ హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లోనే ఉన్నారు. పాదయాత్ర చేసినా.. మధ్య విరామంలో హైదరాబాద్‌కు వెళ్లివచ్చేవారు. ఇక, అసెంబ్లీకి కూడా హైదరాబాద్ నుంచివచ్చి వెళ్లేవారు.
ఇక్కడే మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. తెలంగాణలో రాజకీయాలు చేయను.. అనేదాని వెనుక.. చాలా లోతైన వ్యవహారమే ఉందని అంటున్నారు. జగన్‌కు వ్యాపార సంస్థల్లో సింహ భాగం.. తెలంగాణలోనే ఉన్నాయి. భారతి సిమెంట్స్, సాక్షి పత్రికలు.. హైదరాబాద్‌లోనే ఉన్నాయి.
సో.. వాటిని నష్టం కాకూడదంటే.. తెలంగాణలో కేసీఆర్ రాజకీయాలకు అడ్డు రాకూడదు. ఈ చిన్న సూత్రంతోనే ఆయన తెలంగాణ లో రాజకీయం చేయడం లేదు.రేపు కేసీఆర్ హవా తగ్గినా.. ఏపీలో జగన్ ప్రభావం పెరిగినా.. ఖచ్చితంగా జగన్ అక్కడ రాజకీయం చేయరనే గ్యారెంటీ ఏమీలేదు.
ఇక, విశ్వసనీయత విషయానికి వస్తే.. ఆయన చెబుతున్న పథకాలు.. అమలు చేస్తున్న సంక్షేమంలో అనేక కోతలు పెడుతు న్నారు. వాటిపై పెదవి విప్పడం లేదు. పొరుగు పార్టీల్లో గెలిచిన వారిని తన పార్టీలోకి తీసుకోనని చెప్పారు. తీసుకోవాల్సి వస్తే.. వారితో రిజైన్ చేయించితీసుకుంటానని అన్నారు. కానీ, టీడీపీ తరఫున గెలిచిన నలుగురిని ఇప్పుడు తన పార్టీలోనే కొనసాగిస్తున్నారు. ఇతర విషయాలు.. పరిశీలించినా.. జగన్ విశ్వసనీయతలోని డొల్లతనం కళ్లకు కడుతుంది.
అమరావతి ఉండాలని.. ఉంటుందని అన్నారు. కానీ, మూడు రాజధానులు తెచ్చారు. తనకు నొప్పి కలిగినప్పుడు.. శాసన మండలి రద్దు అన్నారు.. కానీ, తన పార్టీ వారికి పునరావాసం పెరుగుతోందని గ్రహించినప్పుడు రద్దును రద్దు చేశారు. ఇలా చెప్పుకొంటూ పోతే.. తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినప్పుడు రామాయణం అంత ఉంటుంది.