వైసీపీ అధినేత, సీఎం జగన్ పనైపోయింది! వైనాట్ 175 అని మొదలెట్టిన ఆయన.. ఇప్పుడు అధికారం దక్కదనే విషయం అర్థమై ఓటమి భయంతో ఉన్నారనే విషయం స్పష్టమవుతోంది. ఎంతమంది నాయకులు వచ్చినా, ఎన్ని జెండాలు కూటమి కట్టినా వైసీపీ గెలుపును ఆపలేరన్న జగన్ ఇప్పుడు పరాజయానికి మానసికంగా సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. సిద్ధం అంటూ ప్రచారం నిర్వహిస్తున్నా ఫలితం మాత్రం రావడం లేదని తెలిసింది. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రచార శైలి అందుకు రుజువని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఎంత మంది వచ్చినా తన వెంట్రుక కూడా పీకలేరన్న జగన్… ఇప్పుడేమో ఎన్నికలు సజావుగా సాగుతాయన్న నమ్మకం సన్నగిల్లుతోందనే కపట కన్నీళ్లు కారుస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి ఖాయమవడంతోనే ఎన్నికల సరళిపైనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రచారంలోనూ జగన్ తన పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలకు మాత్రమే వెళ్లారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత జగన్ దాదాపు 50 నుంచి 60 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారని చెప్పాలి. ఎంతసేపు కూటమిపై విషం గక్కారే తప్ప ఈ అయిదేళ్లలో తాను చేసిందేమిటో జగన్ చెప్పలేకపోయారు. పైగా ఈ నియోజకవర్గాలన్నీ వైసీపీకి పట్టు ఉన్నవే కావడం గమనార్హం.
కడప జిల్లాలో ఆయన మూడు నియోజకవర్గాలు కవర్ చేశారు. కడప టౌన్‌లోనూ ప్రచారం చేశారు. వరుసగా గెలుస్తున్న బాపట్ల, మాచర్ల, నర్సరావుపేట, కర్నూలు, పలమనేరు లాంటి నియోజకవర్గాలకు వెళ్లారు. కానీ పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాల వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడలేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎలాగో ఓటమి ముందే ఖాయమైంది కాబట్టి ఎందుకు అనుకున్నారో ఏమో జగన్ ఇతర నియోజకవర్గాలకు వెళ్లలేదు. కనీసం వంద నియోజకవర్గాల జోలికి వెళ్లలేదు. కోస్తా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన ఎక్కువగా ప్రచార సభలు పెట్టాల్సింది. కానీ ఏదో చేశామా అంటే చేశామా అన్నట్లు ముగించారు. ఈ సారి కంచుకోటలూ బద్దలయ్యే పరిస్థితి ఉందని జగన్ వీటిపైనే ఫోకస్ పెట్టారేమో అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.