3 వేల కోట్ల రుణానికి పూచీకత్తు…ఈ ‘ఎడారి’కి అప్పులిచ్చే బ్యాంకులేవీ?
అప్పు ఇచ్చేందుకు వచ్చిన బ్యాంకులను ముందుగానే తరిమివేసిన ప్రభుత్వం
ఇప్పుడు రుణం తెచ్చి నిర్మాణాలు పూర్తిచేస్తారట
ఓపక్క అమరావతి మహిళలు, దళితులపై ఆగని దమనకాండ
ఒక రోజు కాదు.. రెండ్రోజులు కాదు… నెల కాదు.. రెండు నెలలు కాదు… 452 రోజులుగా రైతులు, మహిళలు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆందోళన చేస్తున్నారు. కొందరు బలవన్మరణాలకు పాల్పడ్డారు.. ఇంకొందరి గుండెలు ఆగిపోయాయి. అయినా ప్రభుత్వ పెద్దలెవరూ వారి గోడు వినిపించుకోలేదు సరికదా.. ఎన్నో దౌర్జన్యాలు.. ఎన్నెన్నో కేసులు.. చివరకు ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. బేడీలు వేసి మరీ జైళ్లకు తరలించారు. పైగా వారికి పోటీగా మూడు రాజధానులకు మద్దతుగా దీక్షాశిబిరం పెట్టించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలనా రాజధానిని విశాఖకు తరలిస్తామని మంత్రులు, వైసీపీ పెద్దలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో హఠాత్తుగా అమరావతిలో మౌలిక వసతుల కల్పనపై సీఎం జగన్ దృష్టి సారించడం విస్మయం గొల్పుతోంది. ఇది రైతులను ఎలాగోలా బుజ్జగించడానికి పన్నిన రాజకీయ ఎత్తుగడేనన్న సంగతి ప్రజలు తెలుసుకోలేరన్న భ్రమల్లో జగన్ ఉన్నారు. అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు ఆపడం లేదని చాటుకోవడానికి.. తద్వారా హైకోర్టు నిర్ణయాలు తమకు ప్రతికూలంగా రాకుండా చూసుకునేందుకు పన్నిన పన్నాగమిది.
గద్దెనెక్కినప్పటి నుంచి.. ఇరవై నెలలుగా రాజధాని అమరావతిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు చేస్తూ.. ఆయా శాఖల కార్యాలయాలను ఒక్కటొక్కటిగా తరలించడానికి జగన్ ప్రభుత్వం చేయని ప్రయత్నం చేయలేదు. హైకోర్టు స్టే ఇచ్చినా దొంగచాటుగా జీవోలిస్తూ పోలీసు, ఆర్టీసీ సముదాయాలను విశాఖలో కొత్తగా నిర్మించేస్తున్నారు. అలాంటిది ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని.. దానిపై అవ్యాజ ప్రేమ కురిపించడానికి సిద్ధమైతే కారణమేంటో తెలియని అమాయకులు కాదు అమరావతి ప్రాంతవాసులు. పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతిని శ్మశానంతో పోల్చితే.. అసెంబ్లీ స్పీకర్ ఏకంగా ఎడారి అనేశారు.
చీమూనెత్తురూ లేని కృష్ణా జిల్లా మంత్రి పేర్ని నాని.. అమరావతిలో ఏముంది మట్టి.. నీరు తప్ప అని వ్యాఖ్యానించారు. జగన్ గద్దెనెక్కడానే రాజధానిలో ఎక్కడి పనులు అక్కడ ఆపేసి.. అక్కడి అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేసిన బ్యాంకులను కూడా తరిమేశారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి సీఆర్డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించుకున్నారు. వీటిపై గవర్నర్ ఆమోదముద్ర కూడా వేశారు. పరిపాలనా రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ హైకోర్టులో కేసుల కారణంగా అవి నిలిచిపోయాయి.
రాజధానిగా అమరావతిని కనీసం గుర్తించడానికైనా ప్రభుత్వానికి మనస్కరించడం లేదు. కేబినెట్ సమావేశాల కోసం తప్పితే జగన్ వెలగపూడి సచివాలయం ముఖం చూడడమే మానుకున్నారు. మంత్రులు, ప్రభుత్వ పెద్దలు, వైసీపీ ముఖ్య నేతలు అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్ ఆధ్వర్యంలో మూడు రాజధానులకు మద్దతుగా పోటీ ఆందోళనలు చేయిస్తున్నారు.
కృష్ణానది కరకట్ట రోడ్డును రూ.150 కోట్లతో 4 వరుసల రహదారిగా విస్తరించాలని, రాజధానిలోని కొన్ని ప్రధాన రహదారులు, హ్యాపీనెస్ట్ తదితర ప్రాజెక్టులనూ ‘సాధ్యమైనంత త్వరగా’ పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. ఆ వెంటనే అమరావతిపై ఏ విధంగా ముందుకు వెళ్లాలి.. శాసన రాజధానిగా అందులో చేయాల్సిన ఏర్పాట్లపై భావి కార్యాచరణ ఎలా ఉండాలి.. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా నిర్మాణాలు పూర్తయ్యేలా ఏమేం చేయాలో సూచించాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అధ్యక్షతన 9 మంది ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీని నియమించింది.
ఆ తర్వాత.. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎస్ దాస్ అమరావతిలో పర్యటించారు. అనంతరం సీఎం ముఖ్య సలహాదారు, మాజీ సీఎస్ నీలం సాహ్ని, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఒకటికి రెండుసార్లు టూర్ చేశారు. ఆ తర్వాత అమరావతిపై ఏర్పాటైన 9 మంది సభ్యుల కమిటీతో సీఎస్ భేటీ అయ్యారు. అందులో ‘శాసన రాజధాని’గా అమరావతిలో కల్పించాల్సిన మౌలిక సదుపాయాల అధ్యయానికి కర్ణాటక, జమ్మూకశ్మీరుల్లో పర్యటించి అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 75 శాతం మేర పనులు జరిగిన భవనాలను పూర్తి చేయాలని నిర్దేశించారు.
ఏఎంఆర్డీఏ (గతంలో ఏపీసీఆర్డీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల స్థితిగతులపై చర్చించారు. ఇప్పటికే జరిగిన పనులకు సంబంధించి వివిధ నిర్మాణ సంస్థలకు సుమారు రూ.302 కోట్లమేర చెల్లించాల్సి ఉందని, భవనాల్లో 75 శాతంమేర పనులు జరిగిన అన్నింటినీ పూర్తి చేసేందుకు మరో రూ.2,112 కోట్లు అవసరమవుతాయని అధికారులు ఆయనకు తెలుపగా.. ఈ నిధుల సమీకరణ కోసం బ్యాంకులతో సంప్రదింపులు జరపాల్సిందిగా సూచించారు.
ఇవన్నీ ముగిసిన తర్వాత.. వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని ఎల్పీఎస్ జోన్ల (రాజధానికి భూములిచ్చిన రైతులకు సమీకరణ పథకం కింద అందజేసిన రిటర్నబుల్ ప్లాట్లతో కూడినవి) అభివృద్ధితోపాటు మౌలిక వసతుల కల్పన కోసం అవసరమైన రూ.3,000 కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చేందుకు అంగీకరిస్తూ తీర్మానించింది.
కానీ శ్మశానం, ఎడారి అభివృద్ధికి ఇంత మొత్తం రుణంగా ఇచ్చేదెవరు? ప్రజలను మభ్యపెట్టడానికే అమరావతిలో త్వరలోనే ఎంతో అభివృద్ధి జరగబోతోందన్న భ్రమలు కలిగించే ప్రయత్నమేనని ఘంటాపథంగా చెప్పవచ్చు. ‘కడుపులో లేనిది కావలించుకున్నట్లే వస్తుందా’ అన్న సామెత జగన్ తీరుకు సరిగ్గా సరిపోతుంది.
మహిళలపై దాష్టీకం..
నిజంగా అమరావతిపై చిత్తశుద్ధి ఉండి ఉంటే.. ఆందోళన చేస్తున్న రైతులతో ప్రభుత్వం చర్చించి ఉండేది. కనీసం అధికారులనైనా సంప్రదింపులకు పంపి ఉండేది. పోలీసుల దమనకాండను ఆపిఉండేది. ఇటీవల మహిళా దినోత్సవం రోజు రాజధాని మహిళలు బెజవాడ కనకదుర్గమ్మను, గుణదల మేరీమాతను దర్శించుకోవడానికి బయల్దేరితే.. వారి పట్ల మగపోలీసులు ఎంత అమానుషంగా ప్రవర్తించారో ప్రపంచమంతా చూసింది. కాళ్లతో తొక్కి, లాఠీలతో పొడిచి.. రాజధాని మహిళలపై జులుంవేయరాని చోట్ల చేతులు వేస్తూ.. చెప్పుకోలేని విధంగా తడుముతూ.. పరమనీచంగా వ్యవహరించారు.
మానవ హక్కులు… మరీ ముఖ్యంగా మహిళా హక్కుల పరిరక్షణకు సాధారణ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ల వరకు శిక్షణ పొందుతుంటారు. ఆ శిక్షణలో వీరు నేర్చుకున్నదేమిటో అంతుపట్టడం లేదు. నిజంగా అమరావతి అభివృద్ధిని జగన్ కాంక్షిస్తుంటే ఇంత అనాగరికంగా వ్యవహరిస్తారా? పశువులు కూడా తోటి పశువులతో సామరస్యంగా ఉంటాయి. జాతి శత్రువులను కూడా గౌరవిస్తాయి. కానీ నమ్మి ఓటేసిన తమ పట్ల జగన్ అమానుషంగా వ్యవహరిస్తున్నారని అమరావతి ప్రజలు వాపోతున్నారు.