ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువు తీరి 45 – 50 రోజులే. గడిచిన కొన్నేళ్లుగా అధికార బదిలీ జరిగిన ప్రతిసారీ పరిస్థితులు కుదుట పడటానికి కనిష్ఠంగా ఆర్నెల్లు.. గరిష్ఠంగా ఏడాది సమయం తీసుకుంటున్న పరిస్థితి. అలాంటప్పుడు చంద్రబాబు సర్కారు ఏర్పడిన 45 రోజుల్లో జరిగిన ఘటనల్ని పట్టుకొని వైసీపీ అధినేత జగన్ రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయటం ఆసక్తికరంగా మారింది. సాధారణంగా బలమైన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. రాష్ట్రపతిపాలన డిమాండ్ ను అంత త్వరగా చేయరు. కారణం.. అదేమీ సాదాసీదా డిమాండ్ కాదు.
కొన్ని అస్త్రాల్ని సంధించిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు రాకపోతే.. అంతిమంగా రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని బయటకు తీస్తారు. అలా తీసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని కాదు. కాకుంటే.. పరిస్థితి తీవ్రతను తెలియజేసేందుకు ఈ డిమాండ్ పనికొస్తుంది. పుంగనూరులో చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులు.. వినుకొండలో జరిగిన హత్యతో పాటు.. జగన్ అండ్ కో చెబుతున్నట్లుగా ఈ నెలన్నర రోజుల్లో జరిగిన హత్యలు.. దాడులను కారణాలుగా చూపి రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయటంలో అర్థం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దీనికి కారణం లేకపోలేదు. చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఏపీలోని పలు జిల్లాల్లో హత్యలు.. దాడులు జరిగాయి. అయితే.. వైసీపీకి చెందిన వారు హత్యకు గురి కావటం మాత్రమే జరగలేదు. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు హత్యకు గురైనట్లుగా టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కాకుంటే.. వైసీపీ వారు చెప్పుకుంటున్నంత తీవ్రంగా తమ పార్టీకి చెందిన వారి గురించి చెప్పట్లేదన్న ఫిర్యాదును ఆ పార్టీ సానుభూతిపరులే చేస్తున్నారు.
రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేస్తున్న వైఎస్ జగన్.. అందుకు చూపిస్తున్న కారణాల్లో ముఖ్యమైనది పుంగనూరు.. వినుకొండ ఎపిసోడ్ లు. అయితే.. ఈ రెండు ఎపిసోడ్ లు అంత బలంగా లేవంటున్నారు. ఎంతో హడావుడి చేసిన వినుకొండ హత్య ఉదంతంలో అధికార తెలుగుదేశం పార్టీ హస్తం కంటే కూడా.. ఇద్దరు పాత మిత్రుల మధ్య జరిగిన అధిపత్యపోరు మాత్రమే తప్పించి మరింకేమీ లేదన్న విషయం.. ఆ కేసును జాగ్రత్తగా ఫాలో అయ్యే వారికి అర్థమవుతుంది.
ఇక.. పుంగనూరు విషయానికి వస్తే.. ఎంపీ మిథున్ రెడ్డి రాక సందర్భంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల్లో.. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఒక ఎంపీ వెళతారు? అని పోలీసు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. గతంలోనూ ఆయన్ను పుంగనూరుకు వెళ్లకుండా అడ్డుకోవటాన్ని ప్రస్తావిస్తున్నారు. మిథున్ రెడ్డి పుంగనూరుకు వెళితే.. శాంతిభద్రతల సమస్య తలెత్తే వీలుందన్న విషయాన్ని పోలీసులు చెబుతున్నారు. అలాంటి వేళలో.. గుట్టుచప్పుడు కాకుండా వెళ్లటాన్ని తప్పు పడుతున్నారు.
మిథున్ రెడ్డి వెళ్లటం తప్పు కాదనే అనుకుంటే.. వెళ్లిన తర్వాత టీడీపీ వర్సెస్ వైసీపీ వర్గాలు తలపడినప్పుడు.. వైసీపీ వర్గాలు పెద్ద ఎత్తున గాయపడితే మరోలా ఉంటుంది. కానీ.. పుంగనూరు ఎపిసోడ్ లో టీడీపీ వర్గీయులు గాయపడటం.. పఆసుపత్రిలో చికిత్స పొందటం హైలెట్ అయినప్పుడు.. ఈ రెండు ఉదంతాలతో రాష్ట్రపతి పాలన డిమాండ్ చేయటంలో అర్థం లేదంటున్నారు.
గడిచిన 45 రోజుల్లో ఏపీలో బోలెడన్ని హింసాత్మక చర్యలు చోటు చేసుకున్నట్లుగా చెబుతున్న జగన్.. తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఎన్నెన్ని ఘటనలు జరిగాయన్నది మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. చివరకు నాటి విపక్షానికి చెందిన పార్టీ ప్రధాన కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేయటం.. గేటును బద్ధలు కొట్టటం లాంటి ఎన్నో ఘటనలు జరిగిన వైనాన్ని మర్చిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ఎప్పుడో కానీ తీయాల్సిన రాష్ట్రపతి పాలన అస్త్రాన్ని ఇంత త్వరగా తీయటం వ్యూహాత్మక తప్పిదంగా చెబుతున్నారు. మరెలాంటి వ్యూహంతో జగన్ ఆ డిమాండ్ ను తెర మీదకు తెచ్చారన్నది ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చగా మారటం గమనార్హం.